కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నందన్ నిలేకని
సాక్షి, బెంగళూరు: ‘ఆధార్’ రూపకర్తగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని(58) ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దక్షిణ బెంగళూరు లోక్‌సభ స్థానాన్ని నందన్ నిలేకనికి కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. దీంతో ఆదివారం ఉదయం బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిలేకని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు.
కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిలేకని మీడియాతో మాట్లాడుతూ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ-ఆధార్) చైర్మన్ పదవికి నాలుగు రోజుల క్రితమే రాజీనామా చేసినట్టు చెప్పారు. ఆధార్ ప్రచారంలో తన ఫొటో వాడుకోవడం నిబంధనలకు విరుద్ధమైతే ఎన్నికల కమిషన్ తీసుకునే ఏ చర్యలకైనా తాను కట్టుబడి ఉంటానన్నారు. కాగా, బెంగళూర దక్షిణ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ అనంతకుమార్ బరిలో దిగనున్నారు.
బలగాల తరలింపునకు 100 రైళ్లు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపునకు కేంద్ర హోం శాఖ 100కు పైగా రైళ్లను వినియోగించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ను, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని బలగాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వేగంగా తరలించేందుకు వీలుగా రైళ్లను అద్దెకు తీసుకోవాలని హోం శాఖ నిర్ణరుుంచింది. ఎన్నికలకు ఆయూ రాష్ట్రాల్లోని బలగాలకు అదనంగా సుమారు 2 లక్షల మంది కేంద్ర పారామిలటరీ సిబ్బందిని మోహరించనున్నట్టు అంచనా. ఈ మేరకు తరలింపు ఏర్పాట్ల కోసం హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఇప్పటికే రైల్వేబోర్డు చైర్మన్‌కు లేఖ రాసినట్టు అధికారవర్గాలు వెల్లడించారుు.
డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు: కారత్
సాక్షి, చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకేతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం నాగపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే నుంచి తమకు ఆహ్వానం అందిందని, కానీ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన డీఎంకేతో పొత్తుపెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి అండగా నిలిచిన ట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సీపీఎం, సీపీఐలు కలిసి పోటీ చేస్తాయని కారత్ స్పష్టం చేశారు.
తమిళనాడులో కాంగ్రెస్‌కు భంగపాటు
సాక్షి, చెన్నై: తమిళనాడులో పొత్తుల కోసం కాంగ్రెస్ ఎదురుచూపులు ఫలించలేదు. పొత్తులపై డీఎంకే, డీఎండీకేల కోసం ఎదురు చూసిన కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. 2 జీ స్పెక్ట్రం కేసులో తమ పార్టీకి చెందిన రాజా, కనిమొళిని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని బహిరంగంగానే ఆరోపించిన డీఎంకే అధినేత కరుణానిధి కాంగ్రెస్‌తో పొత్తుకు నిరాసక్తత ప్రదర్శించారు. అయితే కాంగ్రెస్ పెద్దల రాయబారంతో కరుణ మెత్తబడినా ఆయన తనయుడు స్టాలిన్ ససేమిరా అనడంతో పొత్తు ప్రస్తావనే లేకుండా పోయింది. మరోవైపు కాంగ్రెస్ పిలుపును ఖాతరు చేయని డీఎండీకే.. బీజేపీ కూటమిలో చేరింది. దీంతో ఒంటరిపోరుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.
విరాళమిస్తే.. కేజ్రీతో విందు!
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 15, 16 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విరాళాలు రాబట్టుకునేందుకు 15న బెంగళూరులో కేజ్రీవాల్‌తో డిన్నర్ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ కర్ణాటక మీడియా సమన్వయకర్త రోహిత్ రంజన్ తెలిపారు. డిన్నర్‌లో పాల్గొనే ఒక్కో వ్యక్తి రూ.20వేలు చెల్లించాలన్న వార్తలపై ప్రశ్నించగా విధి విధానాలు నిర్ణయించాల్సి ఉందన్నారు. కాగా, ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం రూ.13.41లక్షలను ఖర్చు చేసినట్లు ఆర్టీఐ కింద ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. నరేంద్ర మోడీపై మండిపడ్డారు. పేదలకు 50 వేల ఇళ్లు కట్టిస్తానంటూ హామీ ఇచ్చి 11 ఏళ్లు గడిచినా ఆయన 50 ఇళ్లు కూడా కట్టించలేదని ఆదివారం మథుర సమీపంలోని నౌజీల్ పట్టణంలో జరిగిన సభలో ఎద్దేవా చేశారు.
ఎప్పుడూ గెలవనన్ని సీట్లు గెలుస్తాం: అద్వానీ
రాంచీ: లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ గెలవనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అతితక్కువ స్థానాలకు పడిపోతుందని జోస్యం చెప్పారు. 1951-52 నుంచి ఎన్నికలన్నింటినీ చూశానని, ఆ అనుభవం మీద ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే తమ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని తెలిపారు. రాజస్థాన్ మాజీ గవర్నర్ కైలాస్‌పతి మిశ్రా జ్ఞాపకార్థం ఆదివారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అద్వానీ.. కాంగ్రెస్‌కు మూడంకెల సీట్లు దక్కే సూచనలు ఏమీ లేవన్నారు.
‘వారణాసి’పై పార్టీ నిర్ణయిస్తుంది: జోషి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న వివాదంపై బీజేపీ సీనియర్ నేత, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి తొలిసారి స్పందించారు. ‘నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. నిబద్ధత గల బీజేపీ సైనికుడిలా బోర్డు నిర్ణయాన్ని శిరసావహిస్తా’ అని తెలిపారు. వారణాసి స్థానం నుంచి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నిలబెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జోషి వాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శివసేనతో నవనిర్మాణ సేన ఢీ!
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) శివసేనపై సమర శంఖారావం పూరించింది. శివసేన పోటీచేసే లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపడంతోపాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించింది. ఎంఎన్‌ఎస్ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. వీరిలో బాలీవుడ్ నిర్మాత మహేష్ మంజ్రేకర్ కూడా ఉన్నారు.
ఎలక్షన్ వాచ్...
Published Mon, Mar 10 2014 4:34 AM | Last Updated on Sat, Mar 9 2019 3:30 PM
Advertisement
Advertisement