న్యూఢిల్లీ: మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. పోటీ చేసే స్థానాలు, కూటమి మధ్య సీట్ల పంపకాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్.. సింహ భాగం స్థానాల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
మొత్తం 543 లోక్‌సభ నియోజక వర్గాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 300 నుంచి 350 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఈ మేరకు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు. వీటిలో 250 స్థానాల్లో సొంతంగా బరిలోకి దిగాలని ఆలోచిస్తుండగా.. ‘ఇండియా కూటమి’లోని మిత్ర పక్షాలతో కలిసి తొమ్మిది రాష్ట్రాల్లో 75 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలతోపాటు బీజేపీకి ప్రత్యక్ష పోటీ ఉన్న రాష్ట్రాల్లో అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక (28 సీట్లు), రాజస్థాన్ (25 సీట్లు). గుజరాత్ (26 సీట్లు), రాజస్థాన్ (25 సీట్లు), ఆంధ్రప్రదేశ్ (25 సీట్లు), అస్సాం (14 సీట్లు), ఛత్తీస్‌గఢ్ (11 సీట్లు), హర్యానా (10 సీట్లు), అరుణాచల్ ప్రదేశ్(2) వంటి రాష్ట్రాల్లో సీట్లు పంచుకునేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయడం లేదు.
చదవండి: మహువా పిటిషన్: లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం కోర్టు నోటీసు
కాగా ఇండియా కూటమితో కలిసి తొమ్మిది రాష్ట్రాల్లో సీట్ల పంపకాలకు కాం‍్గరెస్ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే మహారాష్ట్రలో 48 స్థానాలు ఉండగా ఎక్కువ స్థానాల్లో పోటీలోకి దిగాలని భావిస్తోంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుండగా.. మిగిలిన వాటిలో ఉద్దవ్ వర్గం శివసేనకు 15, శరద్ పవార్ ఎన్సీపీకి 15 సీట్లు ఇవ్వనుంది. ఈ క్రమంలో మిత్రపక్షాల నుండి గట్టి సవాలును ఎదుర్కొంటోంది.
ఇక బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని ఆ పార్టీ(కాంగ్రెస్) నాలుగు స్థానాల్లో బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఆర్‌జేడీ, జేడీయూలు 17 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. నాలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమిలో మిత్రపక్షమైన ఆప్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్ తీవ్ర సవాల్‌ను ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గోవా విషయానికొస్తే ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే ఆప్ కోరితే ఒక సీటు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా 26 స్థానాలున్న గుజరాత్‌లో ఆప్‌కు ఐదు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఆప్ సైతం రెండు మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
జార్ఖండ్‌లోని 14 స్థానాల్లో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మిగిలిన ఏడు సీట్లు దాని మిత్రపక్షాలైన జేఎంఎం (4 సీట్లు), ఆర్జేడీ-జేడీయూ-లెఫ్ట్ (3 సీట్లు) కోసం కేటాయించింది. కేరళలో 16 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్న కాంగ్రెస్, మిగిలిన స్థానాలను(4) స్థానిక పార్టీలకు ఇచ్చేందుకు సిద్ధమైంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బెంగాల్‌తో పాటు పంజాబ్, మహారాష్ట్రలో మిత్రపక్షాలతో పొత్తు అంశం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది.
ఇక పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఇటు కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు డిసెంబరు 26న పంజాబ్‌లోని పార్టీ అగ్రనేతలతో జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment