మా వాళ్లే ముంచేశారు: యాక్సిస్ బ్యాంకు
మా వాళ్లే ముంచేశారు: యాక్సిస్ బ్యాంకు
Published Sun, Dec 18 2016 5:20 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM
న్యూఢిల్లీ: సంస్ధలో పనిచేసే ఉద్యోగులే యాక్సిస్ బ్యాంకు పేరును నాశనం చేశారని యాక్సిస్ బ్యాంకు ఎండీ, సీఈవో షీఖా శర్మ ఆదివారం పేర్కొన్నారు. ఖాతాదారుల లావాదేవీలను మరింత భద్రంగా నిర్వహించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అకౌంట్లలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెరిగిన డిపాజిట్లపై కన్నేసి ఉంచుతున్నామని తెలిపారు. ఈ మేరకు యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులందరికీ ఓ లేఖను రాసినట్లు వెల్లడించారు.
సంస్ధలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఆమెను తలదించుకునేలా చేశారని చెప్పారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొందరు స్వార్ధపరుల కారణంగా 55 వేల మంది శ్రమ కొట్టుకుపోయిందని అన్నారు. గత వారం నోయిడాలోని ఓ యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో గల 20 అకౌంట్లలో గంపగుత్తగా పడిన రూ.60 కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో పాటు దేశంలోని పలు యాక్సిస్ బ్యాంకు బ్రాంచిల్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఒక్కసారిగా పెరిగాయి.
ఈ విషయంలో ప్రభుత్వ అధికారులకు సహకరించడానికి తాము సిద్ధమని షీఖా ప్రకటించారు. కేపీఎంజీ ద్వారా ఫోరెన్సిక్ విధానాన్ని ఉపయోగించి అనుమానస్పద అకౌంట్లను గుర్తిస్తామని చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం యాక్సిస్ బ్యాంకుకు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు సౌకర్యవంతంగా బ్యాంకు సేవలు వినియోగించుకునేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించామని చెప్పారు.
Advertisement