మహిళకు ఆర్థిక సాధికారత అవసరం..
నేటి మహిళకు ఆర్థిక స్వతంత్రం, సాధికారిత అవసరం. ఆధునిక కాలంలో భవిష్యత్ ఆర్థిక భద్రత వైపు వారు దృష్టి సారించాలి. మొదటిజీతం అందిన రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాలి. మహిళలు చాలా మందిలో అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అయితే ఆయా అంశాలను వారు తమ సొంత వ్యక్తిగత ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవడంలేదు. ఈ పరిస్థితి మారాలి.
మొదటి మదుపు సిప్‌లో...!
తమ కాళ్లపై తాము నిలబడుతూ, ఆర్థిక భరోసా పొందే క్రమంలో మహిళ మొదటిగా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే క్రమానుగత పెట్టుబడుల ప్రణాళికలపై (సిప్) దృష్టి పెడితే బాగుంటుంది. దీర్ఘకాలంలో మదుపు ప్రయోజనాన్ని భారీగా అందించడానికి దోహదపడే పథకాలివి. కొద్ది మొత్తాల్లో మదుపు దీర్ఘకాలంలో మంచి ఆర్థిక లబ్ధిని సిప్ స్కీమ్‌లు చేకూర్చుతాయి. మార్కెట్ భారీ ఒడిదుడుకుల ప్రభావం అంత భారీగా సిప్‌లపై ఉండదు.
లక్ష్యాలు అవసరం
ఆర్థిక భద్రత భరోసా పొందే క్రమంలో మహిళ తొలుత తన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరం. అది బిడ్డ చదువు విషయంలో భవిష్యత్ వ్యయానికి సంబంధించినది కావచ్చు. లేదా హాలిడే ట్రిప్‌కు ఉద్దేశించినది కావచ్చు. ఆయా అంశాలను, వ్యయాలను మదింపుచేసుకుని, అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోడానికి ముందునుంచే ఆలోచించాలి. విద్య వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించనదైతే ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు బెస్ట్. ఇప్పటి నుంచీ రెండేళ్లలో ఏదైనా విహారయాత్రకు ప్రణాళిక వేసుకుంటే... స్వల్పకాలిక డెట్ ఫండ్స్ తగిన ప్రయోజనాన్ని చేకూర్చే వీలుంది. ఇలా ఎన్ని లక్ష్యాలున్నా.... సంపదలో కొంత మొత్తాలను వేర్వేరుగా ఆయా లక్ష్యాలకు కేటాయించడం సముచితం.
సలహాలూ తీసుకోవాలి...
ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి చక్కటి ప్రయోజనాలు పొందడానికి నిపుణుల సలహాలూ కీలకమే. సంపాదన మొత్తం, లక్ష్యాలు, జీవిత భద్రత, ఆర్థికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాధి అంశాలన్నింటినీ ఒక పేపర్‌మీద ఉంచుకుని తగిన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రణాళికల రూపకల్పన విషయంలో అవసరమైతే నిపుణుల సలహాలనూ మహిళలు తీసుకోవాలి. మదుపు అంశాల విషయంలో నిపుణుల సలహాలు కీలకం.