'అనూహ్య' నిందితుడ్ని పట్టించింది పోర్టరే | Esther Anuhya case: How a porter led cops to the killer! | Sakshi
Sakshi News home page

'అనూహ్య' నిందితుడ్ని పట్టించింది పోర్టరే

Published Wed, Mar 5 2014 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

'అనూహ్య'  నిందితుడ్ని పట్టించింది పోర్టరే

'అనూహ్య' నిందితుడ్ని పట్టించింది పోర్టరే

సాక్షి, ముంబై: ఎస్తేర్ అనూహ్య హత్య.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది.. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఎట్టకేలకు నిందితుడు దొరికాడు.. అసలు నిందితుడు ఎలా దొరికాడు... అతడిని మొదటగా గుర్తించింది ఎవరు.
 
 అనూహ్య హత్య కేసులో నిందితుడిని గుర్తించడంలో ఓ రైల్వే పోర్టర్ కీలక పాత్ర పోషించడం విశేషం. కుర్లా లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ)లోని ప్రమోద్ తోమ్రే అలియాస్ పమ్యా ఈ కేసును ఛేదించడంలో కీరోల్ పోషించాడు. అందరికంటే ముందు నిందితుడు చంద్రభాన్‌ను గుర్తుపట్టింది ప్రమోద్ తోమ్రేనే. అంతేకాదు నిందితుని వివరాలు కనుగొనేందుకు స్వయంగా ఓ డిటెక్టివ్‌గా మారాడు. అతని సహకారంతోనే పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు.

అయితే ఈ విషయాన్ని ముంబై పోలీసులు ఎక్కడా వెల్లడించకపోవడం విశేషం. అనూహ్య కేసుకు సంబంధించి ప్రమోద్ తోమ్రేను ‘సాక్షి’ కలిసింది. అతను ‘సాక్షి’కి అందించిన వివరాల ప్రకారం.. ఎస్తేర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను విచారించారు. అలాగే ప్రమోద్‌తోపాటు సుమారు వంద మంది రైల్వే కూలీలను విచారించారు. వీరందరికీ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించారు.
 
  సీసీటీవీ దృశ్యాల్లో అనూహ్యతో బయటికి వస్తున్న వ్యక్తిని చూసి ప్రమోద్ ఆశ్చర్యపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లోని వ్యక్తి గతంలో ఎల్‌టీటీలో తనతోపాటు కూలీగా పనిచేసే చంద్రభాన్ సానప్ అలియాన్ చౌక్యా అని రైల్వే పోలీసులకు తెలిపాడు. అతను కంజూర్‌మార్గ్‌లో నివసించేవాడని చెప్పాడు. ఆ తర్వాత రైల్వే పోలీసులు కంజూర్‌మార్గ్ కు వెళ్లి చంద్రభాన్ కోసం గాలించగా ఆచూకీ తెలియలేదు. దీంతో రైల్వే పోలీసులు ప్రమోద్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

చంద్రభాన్ 2007, 2008 సమయంలో రైల్వే కూలీగా పని చేశాడని, 2008లోనే తన రైల్వే కూలీ లెసైన్సును రూ.4.5 లక్షలకు మరొకరికి విక్రయించి కారు కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత తనను కొన్నిసార్లు కలిసినట్టు తెలిపాడు. పోలీసులకు సాయం చేసేందుకు చంద్రభాన్ వివరాలు తెలుసుకోవాలని ప్రమోద్ నిర్ణయించుకున్నాడు.
 
 ప్రమోద్‌కు రివార్డు దక్కాల్సిందే..!
 చంద్రభాన్ సానప్‌ను గుర్తించడంతోపాటు అతడిని పట్టుకోవడంలో ప్రమోద్ తోమ్రే కీలకపాత్ర పోషించాడని కుర్లా రైల్వే సీనియర్ ఇన్‌స్పెక్టర్ శివాజీ దుమాలే చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రమోద్ చెప్పినవన్నీ వాస్తవమేనన్నారు. ప్రమోద్ ఇచ్చిన ఆధారాలతోనే నిందితుని ఆచూకీ తెలుసుకున్నామని, రివార్డు ఇవ్వాల్సివస్తే ప్రమోద్ తోమ్రేకే ఇవ్వాలని సూచించారు.
 
 డిటెక్టివ్‌గా రంగంలోకి దిగి..
 చంద్రభాన్ గురించి తెలుసుకునేందుకు ప్రమోద్ స్వయంగా రంగంలోకి దిగాడు. రైల్వే పోలీసులకు ఈ విషయం తెలిసినప్పటికీ వారు కూడా అతడిని ప్రోత్సహించారు. చంద్రభాన్ మిత్రులను వెతుకుతూ కంజూర్‌మార్గ్ వెళ్లిన ప్రమోద్ కొద్ది రోజుల పాటు వారితో కలిసిపోయి వివరాలు సేకరించాడు. చంద్రభాన్ నాసిక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న చంద్రభాన్ బుల్డానాలో దైవదర్శనానికి వెళ్లిన ట్టు వివరాలు సేకరిం చాడు. ఆ వివరాలన్నిం టినీ రైల్వే పోలీసులకు చేరవేశాడు. ఈ వివరాల ఆధారంగానే రైల్వే పోలీసులు చంద్రభాన్‌ను అదుపులోకి తీసుకున్నారని ప్రమోద్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement