ముంబైలో పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ సై
ముంబై: ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబై దృష్టి సారించింది. ముంబైలోని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. మహారాష్ట్రలోని మిగతా స్థానాల్లో కూడా పోటీ చేయాలని భావిస్తోంది. ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. లోక్సభ స్థానాల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ముంబైలో ఆరు లోక్సభ స్థానాలున్నాయి.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని ఆప్ సభ్యులకు ఉత్సాహాన్నిచ్చాయని వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నడుం కట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీవైపు ప్రజలు చూస్తున్నారని మయాంక్ గాంధీ అన్నారు. అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారని తెలిపారు. 15 ఏళ్లుగా హస్తినను ఏలుతున్న షీలా దీక్షిత్ను ఓడించి సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ముంబైపై దృష్టి పెట్టడడంతో ప్రధాన పార్టీల్లో కలకలం మొదలయింది.