Mumbai elections
-
బీజేపీ మిషన్ @120
సాక్షి, ముంబై: వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా 120 స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు బీజేపీ ‘మిషన్–120’కి శ్రీకారం చుట్టింది. 2022లో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ కార్పొరేటర్లు తమ తమ వార్డు పరిధిలో పెండింగ్‌లో పడిపోయిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. బీఎంసీ ఎన్నికలకు సంబంధించిన కులాల రిజర్వేషన్ ఎన్నికల కమిషన్ నుంచి జాబితా విడుదల కాగానే బరిలో ఎలా ముందుకెళ్లాలి, ఎవరిని దింపాలనే దానిపై వ్యూహం రూపొందిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పట్టు బిగిస్తున్న కమలం.. వచ్చే బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా..? లేక ఒంటరిగా పోటీ చేయాలా..? అనే దానిపై మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరకు అది తెగదెంపులు చేసుకునే వరకు దారితీసింది. దీంతో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామాలతో ఒంటరైన బీజేపీకి నష్టాన్నే చేకూర్చింది. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి శివసేనకు తగిన బుద్ది చెప్పాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మిషన్–120 సంకల్పంతో ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి. 2017లో జరిగిన కార్పొరేషన్ ఎన్నిల్లో శివసేన, బీజేపీ సొంత బలంపై పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన 97, బీజేపీ 83 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా, ఇదివరకు బీజేపీ మొత్తం 227 స్థానాల్లో 100 సీట్లకే పోటీచేసి ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేది. కాని 2017లో మొదటిసారి వేర్వేరుగా పోటీచేసి శివసేనకు బీజేపీ మింగుడు పడకుండా చేసింది. ములుండ్, పశ్చిమ అంధేరీ ప్రాంతాల్లో మొత్తం బీజేపీ కార్పొరేటర్లే విజయఢంకా మోగించారు. ఇలా నగరంతోపాటు ఉప నగరాల్లో అనేక చోట్ల బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో ఈసారి మిషన్–120 సంకల్పాన్ని సక్సెస్ చేయాలనే కమలం నాయకులు పట్టుదలతో ఉన్నారు. శివసేనకు చెక్! బీఎంసీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు వార్డుల రిజర్వేషన్ జాబితా విడుదలవుతుంది. రిజర్వేషన్ జాబితా విడుదల కాగానే వెంటనే ఎన్నికల పనిలో నిమగ్నమవుతామని బీజేపీ సీనియర్ నాయకులు తెలిపారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు మంగల్‌ప్రభాత్ లోఢా మార్గదర్శనంలో, అలాగే ఇతర నాయకులు నేతృత్వంలో బీఎంసీ ఎన్నికలకు వెళతామని బీజేపీ కార్పొరేటర్, ప్రతినిధి బాలచంద్ర శిర్షాట్ స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటులో నమ్మక ద్రోహం చేసిన శివసేనకు ఎలాగైన బుద్ది చెప్పాలని ఉద్ధేశంతో బీఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని కమలం నాయకులు తెలిపారు. (చదవండి: ఫడ్నవిస్‌తో శరద్ పవార్ భేటీ..!) -
తీన్బార్
సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడా అని అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వాషీం జిల్లాలో రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వారం రోజుల వ్యవధితో వరుసగా మూడు గురువారాలు ఈ ఎన్నికలు జరుపుతామని వెల్లడించింది. మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన పది స్థానాలకు, రెండో దశలో ఏప్రిల్ 17వ తేదీన 19 నియోజకవర్గాలకు, మూడో దశలో ఏప్రిల్ 24వ తేదీన 19 స్థానాలకు ఎన్నికలు ఉంటాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. మొదటి దశలో... మొదటి దశలో విదర్భలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బుల్డానా, అకోలా, అమరావతి, వర్ధా, రాంటేక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం స్థానాలున్నాయి. రెండో దశలో... ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న రెండో దశ ఎన్నికల్లో మరాఠ్వాడాతోపాటు పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలకు చెందిన 19 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో హింగోలి, నాందేడ్, పర్భణీ, మావల్, పుణే, బారామతి, శిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాఢా, సాంగ్లీ, సాతారా, రత్నగిరి-సింధుదుర్గా, కొల్హాపూర్, హాతకణంగలే ఉన్నాయి. మూడో దశలో... ఏప్రిల్ 24వ తేదీన జరగనున్న మూడో దశ ఎన్నికల్లో ముంబైతోపాటు ఠాణే జిల్లాలున్నాయి. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో మొత్తం 19 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర మధ్య ముంబై, ఉత్తర ముంబై, వాయవ్య ముంబై, ఈశాన్య ముంబై, ఠాణే, భివండీ, కల్యాణ్, పాల్ఘర్, రాయ్‌గఢ్, నాసిక్, దిండోరి, ఔరంగాబాద్, జాల్నా, రావేర్, జల్గావ్, ధులే, నందుర్బార్ ఉన్నాయి. ఏప్రిల్ 10న అసెంబ్లీ ఉప ఎన్నిక... వాషీం జిల్లాలోని రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ జనక్ గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన మరణించారు. అప్పటినుంచి ఈ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఇవీ ప్రధాన పార్టీలు కాంగ్రెస్-ఎన్సీపీ (ప్రజాసామ్యకూటమి), శివసేన-బీజేపీ-ఆర్పీఐ-స్వాభిమాన్ పార్టీ (మహాకూటమి), రాజ్‌ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, ఎస్పీ, పీఐపీ తదితర పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్నాయి. తమ తమ భవితవ్యాన్ని తేల్చుకో నున్నాయి. ‘సోషల్ మీడియా ఖర్చును కచ్చితంగా చూపించాల్సిందే’ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం అభ్యర్థులు ఉపయోగించే సోషల్ మీడియాను కూడా పర్యవేక్షిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో నితిన్ గాద్రే తెలిపారు. దీనికి సంబంధించిన ఖర్చు వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు రాష్ర్టంలో 7.89 కోట్ల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ నెల తొమ్మిది వరకు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం రాష్ట్రంలో 450 నమోదు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఆరు వేల సమస్యాత్మక, 650 అతి సమస్యాత్మక ప్రాంతాలున్నాయన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సి ఉందన్నారు. -
'అనూహ్య' నిందితుడ్ని పట్టించింది పోర్టరే
సాక్షి, ముంబై: ఎస్తేర్ అనూహ్య హత్య.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది.. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఎట్టకేలకు నిందితుడు దొరికాడు.. అసలు నిందితుడు ఎలా దొరికాడు... అతడిని మొదటగా గుర్తించింది ఎవరు. అనూహ్య హత్య కేసులో నిందితుడిని గుర్తించడంలో ఓ రైల్వే పోర్టర్ కీలక పాత్ర పోషించడం విశేషం. కుర్లా లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ)లోని ప్రమోద్ తోమ్రే అలియాస్ పమ్యా ఈ కేసును ఛేదించడంలో కీరోల్ పోషించాడు. అందరికంటే ముందు నిందితుడు చంద్రభాన్‌ను గుర్తుపట్టింది ప్రమోద్ తోమ్రేనే. అంతేకాదు నిందితుని వివరాలు కనుగొనేందుకు స్వయంగా ఓ డిటెక్టివ్‌గా మారాడు. అతని సహకారంతోనే పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు. అయితే ఈ విషయాన్ని ముంబై పోలీసులు ఎక్కడా వెల్లడించకపోవడం విశేషం. అనూహ్య కేసుకు సంబంధించి ప్రమోద్ తోమ్రేను ‘సాక్షి’ కలిసింది. అతను ‘సాక్షి’కి అందించిన వివరాల ప్రకారం.. ఎస్తేర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను విచారించారు. అలాగే ప్రమోద్‌తోపాటు సుమారు వంద మంది రైల్వే కూలీలను విచారించారు. వీరందరికీ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించారు. సీసీటీవీ దృశ్యాల్లో అనూహ్యతో బయటికి వస్తున్న వ్యక్తిని చూసి ప్రమోద్ ఆశ్చర్యపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లోని వ్యక్తి గతంలో ఎల్టీటీలో తనతోపాటు కూలీగా పనిచేసే చంద్రభాన్ సానప్ అలియాన్ చౌక్యా అని రైల్వే పోలీసులకు తెలిపాడు. అతను కంజూర్‌మార్గ్‌లో నివసించేవాడని చెప్పాడు. ఆ తర్వాత రైల్వే పోలీసులు కంజూర్‌మార్గ్ కు వెళ్లి చంద్రభాన్ కోసం గాలించగా ఆచూకీ తెలియలేదు. దీంతో రైల్వే పోలీసులు ప్రమోద్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చంద్రభాన్ 2007, 2008 సమయంలో రైల్వే కూలీగా పని చేశాడని, 2008లోనే తన రైల్వే కూలీ లెసైన్సును రూ.4.5 లక్షలకు మరొకరికి విక్రయించి కారు కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత తనను కొన్నిసార్లు కలిసినట్టు తెలిపాడు. పోలీసులకు సాయం చేసేందుకు చంద్రభాన్ వివరాలు తెలుసుకోవాలని ప్రమోద్ నిర్ణయించుకున్నాడు. ప్రమోద్‌కు రివార్డు దక్కాల్సిందే..! చంద్రభాన్ సానప్‌ను గుర్తించడంతోపాటు అతడిని పట్టుకోవడంలో ప్రమోద్ తోమ్రే కీలకపాత్ర పోషించాడని కుర్లా రైల్వే సీనియర్ ఇన్స్పెక్టర్ శివాజీ దుమాలే చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రమోద్ చెప్పినవన్నీ వాస్తవమేనన్నారు. ప్రమోద్ ఇచ్చిన ఆధారాలతోనే నిందితుని ఆచూకీ తెలుసుకున్నామని, రివార్డు ఇవ్వాల్సివస్తే ప్రమోద్ తోమ్రేకే ఇవ్వాలని సూచించారు. డిటెక్టివ్‌గా రంగంలోకి దిగి.. చంద్రభాన్ గురించి తెలుసుకునేందుకు ప్రమోద్ స్వయంగా రంగంలోకి దిగాడు. రైల్వే పోలీసులకు ఈ విషయం తెలిసినప్పటికీ వారు కూడా అతడిని ప్రోత్సహించారు. చంద్రభాన్ మిత్రులను వెతుకుతూ కంజూర్‌మార్గ్ వెళ్లిన ప్రమోద్ కొద్ది రోజుల పాటు వారితో కలిసిపోయి వివరాలు సేకరించాడు. చంద్రభాన్ నాసిక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న చంద్రభాన్ బుల్డానాలో దైవదర్శనానికి వెళ్లిన ట్టు వివరాలు సేకరిం చాడు. ఆ వివరాలన్నిం టినీ రైల్వే పోలీసులకు చేరవేశాడు. ఈ వివరాల ఆధారంగానే రైల్వే పోలీసులు చంద్రభాన్‌ను అదుపులోకి తీసుకున్నారని ప్రమోద్ చెప్పాడు. -
ముంబైలో పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ సై
ముంబై: ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబై దృష్టి సారించింది. ముంబైలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. మహారాష్ట్రలోని మిగతా స్థానాల్లో కూడా పోటీ చేయాలని భావిస్తోంది. ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ముంబైలో ఆరు లోక్‌సభ స్థానాలున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని ఆప్ సభ్యులకు ఉత్సాహాన్నిచ్చాయని వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నడుం కట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీవైపు ప్రజలు చూస్తున్నారని మయాంక్ గాంధీ అన్నారు. అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారని తెలిపారు. 15 ఏళ్లుగా హస్తినను ఏలుతున్న షీలా దీక్షిత్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ముంబైపై దృష్టి పెట్టడడంతో ప్రధాన పార్టీల్లో కలకలం మొదలయింది.