సాక్షి, ముంబై: వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా 120 స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు బీజేపీ ‘మిషన్–120’కి శ్రీకారం చుట్టింది. 2022లో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ కార్పొరేటర్లు తమ తమ వార్డు పరిధిలో పెండింగ్‌లో పడిపోయిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. బీఎంసీ ఎన్నికలకు సంబంధించిన కులాల రిజర్వేషన్ ఎన్నికల కమిషన్ నుంచి జాబితా విడుదల కాగానే బరిలో ఎలా ముందుకెళ్లాలి, ఎవరిని దింపాలనే దానిపై వ్యూహం రూపొందిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
పట్టు బిగిస్తున్న కమలం..
వచ్చే బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా..? లేక ఒంటరిగా పోటీ చేయాలా..? అనే దానిపై మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరకు అది తెగదెంపులు చేసుకునే వరకు దారితీసింది. దీంతో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామాలతో ఒంటరైన బీజేపీకి నష్టాన్నే చేకూర్చింది. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి శివసేనకు తగిన బుద్ది చెప్పాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మిషన్–120 సంకల్పంతో ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.
బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి. 2017లో జరిగిన కార్పొరేషన్ ఎన్నిల్లో శివసేన, బీజేపీ సొంత బలంపై పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన 97, బీజేపీ 83 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా, ఇదివరకు బీజేపీ మొత్తం 227 స్థానాల్లో 100 సీట్లకే పోటీచేసి ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేది. కాని 2017లో మొదటిసారి వేర్వేరుగా పోటీచేసి శివసేనకు బీజేపీ మింగుడు పడకుండా చేసింది. ములుండ్, పశ్చిమ అంధేరీ ప్రాంతాల్లో మొత్తం బీజేపీ కార్పొరేటర్లే విజయఢంకా మోగించారు. ఇలా నగరంతోపాటు ఉప నగరాల్లో అనేక చోట్ల బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో ఈసారి మిషన్–120 సంకల్పాన్ని సక్సెస్ చేయాలనే కమలం నాయకులు పట్టుదలతో ఉన్నారు.
శివసేనకు చెక్!
బీఎంసీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు వార్డుల రిజర్వేషన్ జాబితా విడుదలవుతుంది. రిజర్వేషన్ జాబితా విడుదల కాగానే వెంటనే ఎన్నికల పనిలో నిమగ్నమవుతామని బీజేపీ సీనియర్ నాయకులు తెలిపారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు మంగల్‌ప్రభాత్ లోఢా మార్గదర్శనంలో, అలాగే ఇతర నాయకులు నేతృత్వంలో బీఎంసీ ఎన్నికలకు వెళతామని బీజేపీ కార్పొరేటర్, ప్రతినిధి బాలచంద్ర శిర్షాట్ స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటులో నమ్మక ద్రోహం చేసిన శివసేనకు ఎలాగైన బుద్ది చెప్పాలని ఉద్ధేశంతో బీఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని కమలం నాయకులు తెలిపారు. (చదవండి: ఫడ్నవిస్‌తో శరద్ పవార్ భేటీ..!)
Comments
Please login to add a commentAdd a comment