సాక్షి, ముంబై: ముంబై నగరంలో రాహుల్ గాంధీ సభ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. శివాజీపార్క్ మైదానంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ముంబై అధ్యక్షుడు భాయి జగ్తాప్ సోమవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిగే లోపే కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సభ ముంబైలో జరుగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలావుండగా, శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.
అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ డిసెంబర్‌లో ముంబై పర్యటనకు వస్తున్నారని తెలిపారు. ఆ ప్రకారం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ముంబై పర్యటన తేదీలను సైతం ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ 137వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 28వ తేదీన శివాజీ పార్క్ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మార్గదర్శనం చేయాల్సి ఉంది. దీంతో శివాజీ పార్క్ మైదానంలో భారీ వేదిక, టెంట్లు, ఇతర ఏర్పాట్లు చేయడానికి వీలుగా ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మైదానాన్ని బుక్ చేసుకునేందుకు అనుమతివ్వాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, శివాజీ పార్క్ మైదానం, పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించి సుమారు పదేళ్లవుతోంది. (చదవండి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మొదలైన ఫిరాయింపుల పర్వం?)
దీంతో ఇక్కడ గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, శివాజీ జయంతి, అంబేడ్కర్ వర్ధంతి తదితర కీలక కార్యక్రమాలు మినహా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ బీఎంసీ, పోలీసులు అనుమ తి నిరాకరించారు. దీంతో అటు వార్షికోత్సవ వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో భాయి జగ్తాప్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సభకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే, కోర్టులో విచారణ జరిగే లోపే కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ముంబైలో రాహుల్ గాంధీ సభపై సందిగ్ధత నెలకొంది. (చదవండి: 18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు!)
Comments
Please login to add a commentAdd a comment