Brihan mumbai corporation
-
Mumbai: రాహుల్ గాంధీ సభపై సందిగ్ధత
సాక్షి, ముంబై: ముంబై నగరంలో రాహుల్ గాంధీ సభ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. శివాజీపార్క్ మైదానంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ముంబై అధ్యక్షుడు భాయి జగ్తాప్ సోమవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లో కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిగే లోపే కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సభ ముంబైలో జరుగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలావుండగా, శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ డిసెంబర్లో ముంబై పర్యటనకు వస్తున్నారని తెలిపారు. ఆ ప్రకారం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ముంబై పర్యటన తేదీలను సైతం ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ 137వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 28వ తేదీన శివాజీ పార్క్ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మార్గదర్శనం చేయాల్సి ఉంది. దీంతో శివాజీ పార్క్ మైదానంలో భారీ వేదిక, టెంట్లు, ఇతర ఏర్పాట్లు చేయడానికి వీలుగా ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మైదానాన్ని బుక్ చేసుకునేందుకు అనుమతివ్వాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, శివాజీ పార్క్ మైదానం, పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించి సుమారు పదేళ్లవుతోంది. (చదవండి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మొదలైన ఫిరాయింపుల పర్వం?) దీంతో ఇక్కడ గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, శివాజీ జయంతి, అంబేడ్కర్ వర్ధంతి తదితర కీలక కార్యక్రమాలు మినహా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ బీఎంసీ, పోలీసులు అనుమ తి నిరాకరించారు. దీంతో అటు వార్షికోత్సవ వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో భాయి జగ్తాప్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సభకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే, కోర్టులో విచారణ జరిగే లోపే కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ముంబైలో రాహుల్ గాంధీ సభపై సందిగ్ధత నెలకొంది. (చదవండి: 18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు!) -
ముంబైకి మరో ముప్పు
ముంబై: కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ముంబై మహానగరంపైకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ముంబై దాహార్తిని తీరుస్తున్న ఏడు సరస్సులు, ఆనకటల్లో నీటి నిల్వలు అడుగంటాయి. కేవలం మరో 42 రోజులకు సరిపడే నీళ్లు మాత్రమే వీటిలో మిగిలాయి. జూన్ నెలలో వానలు బాగానే కురిసినా సరస్సుల్లోకి చేరిన నీరు మాత్రమే అంతతమాత్రమే. ఎగువ వైతర్ణ, మధ్య వైతర్ణ, మోదక్ సాగర్, తన్సా, భట్సా, విహార్, తులసి సరస్సులకు దాదాపు 14.47 లక్షల లీటర్ల తాగు నీటిని నిల్వ చేయగల సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం వీటిలో 1.57 లక్షల లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. తాగునీటి నిల్వలపై నగరవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తెలిపారు. ముందుముందు వానలు బాగా కురుస్తాయనే సమాచారం తమకు ఉందని చెప్పారు.(కోవిడ్ ఔషధం: ఒక్కో ట్యాబ్లెట్ రూ.103) గతేడాది ఇదే సమయానికి ఈ ఏడు సరస్సుల్లో 82,829 లీటర్ల నీరు మాత్రమే ఉంది. 2018లో ఇంతకంటే దారుణంగా నీటి నిల్వలు తగ్గిపోయాయి. దాంతో పంపిణీ చేసే నీటిలో పది శాతం కోత విధించారు. ఈ ఏడాది నీటి పంపిణీలో కోత ఉండకపోవచ్చని బీఎంసీ అధికారులు వెల్లడించారు. (24 గంటల్లో 14,821 కొత్త కేసులు) ముంబై దాహార్తిని తీర్చడానికి రోజుకు 420 కోట్ల లీటర్లు అవసరం కాగా, 375 కోట్ల లీటర్లను మాత్రమే బీఎంసీ పంపిణీ చేయగలుగుతోంది. ‘ఈ ఏడాది ముంబైలో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ సంస్థ వెల్లడించింది. ఎగువ వైతర్ణ, మధ్య వైతర్ణ తదితర డ్యాముల్లో నీటి నిల్వలు గతేడాది పోల్చితే బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి తాగునీటి అందుబాటుపై ఎలాంటి బెంగ అవసరం లేదు’ అని బీఎంసీ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పీ వేల్ రసు తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్ : ఉన్నతాధికారిపై వేటు
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా మహమ్మారి కేంద్రంగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిపై వేటు వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి బదిలీలు చేపట్టరాదని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రవీణ్ స్ధానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఎస్ చహల్‌కు ప్రతిష్టాత్మక బీఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ప్రవీణ్‌ను మంత్రాలయ్‌లోని నగరాభివృద్ధి శాఖకు బదిలీ చేసింది. ముంబై నగరంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసులను అదుపులోకి తేవడంలో విఫలమైన ప్రవీణ్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. కేంద్ర బృందం ముంబై పర్యటన ముగిసిన వెంటనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచి, కంటెయిన్మెంట్ వ్యూహాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని అధికారులు తెలిపారు. ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ముంబైలో కోవిడ్-19 కేసులు రెట్టింపయ్యే వ్యవధిని పెంచడంపై దృష్టిసారించాలని కేంద్రం బృందం సూచించింది. చదవండి : వారి ద్వారానే ఖైదీలకు వైరస్.. -
అనుమతులు లేకపోతే కూల్చివేతే
సాక్షి, ముంబై: కంపాకోలాలోని అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ ఓవైపు సమాయాత్తమవుతుంటే.. మరో 430 అనధికారిక నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. బీఎంసీ వార్డుల వారీగా సర్వే నిర్వహిస్తుండగా ఈ నిర్మాణాలు బయటపడ్డాయి. ఇందులో కొన్ని భవనాల్లో అంతస్తులను మాత్రమే అక్రమంగా నిర్మించగా.. మరికొన్ని భవనాలు పూర్తిగా అనధికారికమైనవని తేలింది. అందులో 74 భవనాలు పూర్తిగా బీఎంసీ అనుమతులు లేకుండా నిర్మితమైనవని సర్వే వెల్లడించింది. అక్రమంగా అదనపు అంతస్తులను నిర్మించిన 96 భవనాలతో బోరివిలీలోని ఆర్ సెంట్రల్వార్డ్ మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో వర్లీలోని జి-సౌత్ దక్కించుకుంది. కంపాకోలాలో 78 అక్రమ నిర్మాణాలున్నాయి. అక్రమ నిర్మాణాల పూర్తి జాబితాను సేకరించామని, వాటిని కచ్చితంగా కూల్చేస్తామని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఏవైనా భవనాలు కోర్టు కేసుల్లో ఉన్నాయేమో పరిశీలించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు. ప్రమాదకర భవనాలూ కూల్చివేత భీవండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక పరిధిలోని ప్రమాదకరమైన భవనాల కూల్చివేత ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. కామత్‌ఘర్ ప్రాంతంలోని పటేల్-గనీ, కాంపౌండ్‌లోని ఇంటి నంబరు 108, 109 రెండు అంతస్తుల భవనాన్ని 40 ఏళ్ల కిందట నిర్మించారు. అయితే గత వర్షాకాలమే భవనం పైకప్పు శ్లాబ్ పోయి పగుళ్లు ఏర్పడింది. మళ్లీ వర్షాకాలం దగ్గర పడుతున్నందున ఎప్పుడైనా కూలే అవకాశాలు ఉండటంతో భవనాన్ని కూల్చేయాల్సిందిగా ప్రభాగ్ సమితి భవన నిర్మాణ శాఖ అధికారులు ఎన్నో మార్లు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో చివరికి గురువారం స్థానిక పోలీసుల సహకారంతో భవనంలోని 36 కుటుంబాలను ఖాళీ చేయించి కూల్చేశారు. -
బీఎంసీ న్యాయవివాదాల ఖర్చు రూ. 50 కోట్లు
బృహన్ ముంబై కార్పొరేషన్‌పై దాఖలయిన వివిధ కేసుల వాదనకు నియమించుకున్న న్యాయవాదులకు కార్పొరేషన్ చెల్లిస్తున్న ఫీజు ఏటా రూ.50 కోట్లు. కార్పొరేషన్‌పై దాఖలయి అపరిష్కృతంగా ఉన్న కేసులు వేలాదిగా ఉన్నాయి. ఈ వివాదాల పరిష్కారానికి న్యాయనిపుణులను నియమించుకోవడానికి కార్పొరేషన్ అతి భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. అక్రమ కట్టడాలు, ఆస్తి పన్ను వివాదం, ఆక్రమణదారులను వెళ్లగొట్టేందుకు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల వంటి 74,100 కేసులు వివిధ న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మెట్రోపాలిటన్ కోర్టులో 37 వేల కేసులు పెండింగులో ఉన్నాయి. ఆ తరువాత సెషన్స్ కోర్టులో 13 వేలు, హై కోర్టులో తొమ్మిది వేల కేసులు పెండింగులో ఉన్నట్లు తేలింది. ఈ కేసులను వివిధ కోర్టులలో వాదించి, కేసు పరిష్కరించడానికి బీఎంసీ ఓ లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకు లాయర్లకు చెల్లించాల్సిన ఫీజులు, వారు రాకపోకలు సాగించేందుకు వాహనాలకు, అవసరమైతే బస చేసేందుకు సార్ హోటళ్లు ఇలా అనేక అవసరాలకు బీఎంసీ డబ్బులు చెల్లిస్తోంది. కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలని బీఎంసీ రీజియన్ల వారీగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకొంది. ఏటా న్యాయవివాదాలకు వెచ్చిస్తున్న రూ.50 కోట్ల నిధులతోపాటు, పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం కాకపోవడంతో (ఒక వేళ పరిష్కారమైతే) వాటి ద్వారా బీఎంసీకి రావాల్సిన రూ. ఆరు వేల కోట్ల మేర బకాయిలు కూడా పెండింగులో ఉండిపోయాయి. న్యాయవివాదాలను సత్వరం పరిష్కరించుకొనేందుకు మార్గాలు అన్వేషించగలిగితే భారీ మొత్తం బీఎంసీ ఖజానాలో మిగులుతోంది.