బృహన్ ముంబై కార్పొరేషన్‌పై దాఖలయిన వివిధ కేసుల వాదనకు నియమించుకున్న న్యాయవాదులకు కార్పొరేషన్ చెల్లిస్తున్న ఫీజు ఏటా రూ.50 కోట్లు. కార్పొరేషన్‌పై దాఖలయి అపరిష్కృతంగా ఉన్న కేసులు వేలాదిగా ఉన్నాయి. ఈ వివాదాల పరిష్కారానికి న్యాయనిపుణులను నియమించుకోవడానికి కార్పొరేషన్ అతి భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. అక్రమ కట్టడాలు, ఆస్తి పన్ను వివాదం, ఆక్రమణదారులను వెళ్లగొట్టేందుకు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల వంటి 74,100 కేసులు వివిధ న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మెట్రోపాలిటన్ కోర్టులో 37 వేల కేసులు పెండింగులో ఉన్నాయి. ఆ తరువాత సెషన్స్ కోర్టులో 13 వేలు, హై కోర్టులో తొమ్మిది వేల కేసులు పెండింగులో ఉన్నట్లు తేలింది. ఈ కేసులను వివిధ కోర్టులలో వాదించి, కేసు పరిష్కరించడానికి బీఎంసీ ఓ లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకు లాయర్లకు చెల్లించాల్సిన ఫీజులు, వారు రాకపోకలు సాగించేందుకు వాహనాలకు, అవసరమైతే బస చేసేందుకు సార్ హోటళ్లు ఇలా అనేక అవసరాలకు బీఎంసీ డబ్బులు చెల్లిస్తోంది. కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలని బీఎంసీ రీజియన్ల వారీగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకొంది.
ఏటా న్యాయవివాదాలకు వెచ్చిస్తున్న రూ.50 కోట్ల నిధులతోపాటు, పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం కాకపోవడంతో (ఒక వేళ పరిష్కారమైతే) వాటి ద్వారా బీఎంసీకి రావాల్సిన రూ. ఆరు వేల కోట్ల మేర బకాయిలు కూడా పెండింగులో ఉండిపోయాయి. న్యాయవివాదాలను సత్వరం పరిష్కరించుకొనేందుకు మార్గాలు అన్వేషించగలిగితే భారీ మొత్తం బీఎంసీ ఖజానాలో మిగులుతోంది.
బీఎంసీ న్యాయవివాదాల ఖర్చు రూ. 50 కోట్లు
Published Tue, Oct 22 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement