సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటోంది. ఈసారి బీఎంసీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న శివసేనను ఎలాగైనా గద్దె దింపి తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. దీనికోసం సినీనటుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే రితేశ్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్‌లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేరకు ముంబై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బీఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు పడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఎంసీ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పారీ్టలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఈ మిత్ర పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని శివసేన అంటుంటే, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలపడుతుందని ముంబై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చారు. అంతేగాక, దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. అది ఈ ఎన్నికల్లోనే జరగవచ్చని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఊహాగానాలను ఇప్పటికే సోనూ సూద్ తోసిపుచ్చారు.
చదవండి : స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం
బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఉత్తర భారతీయులు, మైనారిటీ ఓట్లు ముఖ్యం కానున్నాయి. ప్రజల్లో నటీనటులపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రితేష్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్‌లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని ముంబై కాంగ్రెస్ భావిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా శివసేనదే ఆధిపత్యం. దీంతో ఈసారి ఎలాగైనా శివసేన ఆధిపత్యానికి చెక్ పెట్టి, తమ పట్టు నిలుపుకోవాలని ముంబై కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment