సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడా అని అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వాషీం జిల్లాలో రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వారం రోజుల వ్యవధితో వరుసగా మూడు గురువారాలు ఈ ఎన్నికలు జరుపుతామని వెల్లడించింది. మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన పది స్థానాలకు, రెండో దశలో ఏప్రిల్ 17వ తేదీన 19 నియోజకవర్గాలకు, మూడో దశలో ఏప్రిల్ 24వ తేదీన 19 స్థానాలకు ఎన్నికలు ఉంటాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.
మొదటి దశలో...
మొదటి దశలో విదర్భలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బుల్డానా, అకోలా, అమరావతి, వర్ధా, రాంటేక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం స్థానాలున్నాయి.
రెండో దశలో...
ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న రెండో దశ ఎన్నికల్లో మరాఠ్వాడాతోపాటు పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలకు చెందిన 19 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో హింగోలి, నాందేడ్, పర్భణీ, మావల్, పుణే, బారామతి, శిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాఢా, సాంగ్లీ, సాతారా, రత్నగిరి-సింధుదుర్గా, కొల్హాపూర్, హాతకణంగలే ఉన్నాయి.
మూడో దశలో...
ఏప్రిల్ 24వ తేదీన జరగనున్న మూడో దశ ఎన్నికల్లో ముంబైతోపాటు ఠాణే జిల్లాలున్నాయి. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో మొత్తం 19 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర మధ్య ముంబై, ఉత్తర ముంబై, వాయవ్య ముంబై, ఈశాన్య ముంబై, ఠాణే, భివండీ, కల్యాణ్, పాల్ఘర్, రాయ్‌గఢ్, నాసిక్, దిండోరి, ఔరంగాబాద్, జాల్నా, రావేర్, జల్‌గావ్, ధులే, నందుర్బార్ ఉన్నాయి.
ఏప్రిల్ 10న అసెంబ్లీ ఉప ఎన్నిక...
వాషీం జిల్లాలోని రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ జనక్ గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన మరణించారు. అప్పటినుంచి ఈ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఉంటుందని ఈసీ ప్రకటించింది.
ఇవీ ప్రధాన పార్టీలు
కాంగ్రెస్-ఎన్సీపీ (ప్రజాసామ్యకూటమి), శివసేన-బీజేపీ-ఆర్‌పీఐ-స్వాభిమాన్ పార్టీ (మహాకూటమి), రాజ్‌ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ, ఎస్‌పీ, పీఐపీ తదితర పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్నాయి. తమ తమ భవితవ్యాన్ని తేల్చుకో నున్నాయి.
‘సోషల్ మీడియా ఖర్చును కచ్చితంగా చూపించాల్సిందే’
లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం అభ్యర్థులు ఉపయోగించే సోషల్ మీడియాను కూడా పర్యవేక్షిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో నితిన్ గాద్రే తెలిపారు. దీనికి సంబంధించిన ఖర్చు వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు రాష్ర్టంలో 7.89 కోట్ల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ నెల తొమ్మిది వరకు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం రాష్ట్రంలో 450 నమోదు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఆరు వేల సమస్యాత్మక, 650 అతి సమస్యాత్మక ప్రాంతాలున్నాయన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సి ఉందన్నారు.
తీన్‌బార్
Published Wed, Mar 5 2014 10:25 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement