Mayank Gandhi
-
డ్రామాలు చేయకు.. ప్రధాని ఆలోచన మానుకో!
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన సన్నిహితుడొకరు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ సన్నిహిత అనుచరుడైన ఆప్ మాజీ నేత మయాంక్ గాంధీ తాజాగా తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ బహిరంగ లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను హీరో, రాజకీయ నాయకుడిగా సంబోధిస్తూ ఆయన రాసిన ఈ లేఖలో ఆప్ తాజా ఘోర పరాభవం అహంకారానికి తగిలిన ఎదురుదెబ్బగా అభివర్ణించారు. 'రాజీపడటమే ఎరుగని ఒకప్పటి నిస్వార్థ హీరో అరవింద్ ఇప్పుడు బతికిలేడు. అతని స్థానంలో 2019లో ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో అందుకు అనుగుణంగా మద్దతును పొందాలనుకుంటున్న రాజకీయ నాయకుడు మాత్రమే ఉన్నాడు' అని మయాంక్ విమర్శించారు. 'సొంత అహంకారం, అంతర్గత రాజకీయ కుమ్ములాటల్లో మనం ఇతర పార్టీలను ఓడించాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఢిల్లీ ముఖ్యమంత్రిగా, పార్టీ కన్వీనర్‌గా పగ్గాలు చేపట్టడం ద్వారా పూర్తి అధికారాన్ని నీ చేతుల్లోనే పెట్టుకున్నావు. ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించడానికి ఇంకెంత అధికారం నీకు కావాలి?' అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో పోరాడటానికే ఆప్ పురుడు పోసుకున్నదని, కానీ అలాంటి మరో పార్టీగా మిగలడానికి కాదని హితవు పలికారు. ప్రధానమంత్రి కావాలన్న జాతీయ ఆశయాలను పక్కనబెట్టి ఇకనైన ఢిల్లీలో మెరుగైన పాలన అందించాలని, డ్రామాలు, ఇతరులను నిందించడాలు ఆపాలని ఆయన సూచించారు. -
ఇలాగైతే పార్టీని వీడుతా..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకత్వంపై సీనియర్ నేత మయాంక్ గాంధీ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి తొలగించడాన్ని తప్పు పట్టినందుకు పార్టీలోని కొందరు నేతలు తనను లక్ష్యంగా చేసుకున్నారని శనివారం ఆరోపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ వీడడం తప్ప మరో మార్గం లేదన్నారు. సోషల్ మీడియాలో తనను పార్టీకి, కేజ్రీవాల్‌కు వ్యతిరేకుడిగా చిత్రించే యత్నాలు సాగుతున్నాయన్నారు. ‘ప్రశాంత్, యోగేంద్రలనులను పార్టీ నుంచి తొలగించేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. అయితే వారు పార్టీలోనే కొనసాగుతామని వారి వ్యూహాన్ని తిప్పికొట్టారు. ఇలా చేస్తున్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో కూర్చునే కొందరు పార్టీ విధాన నిర్ణాయక నేతలు నన్ను ఇప్పటికే బీబీఎం గ్రూప్ నుంచి తొలగించారు. ఆశీష్ ఖేతాన్ వంటి నేతలు నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రలోనూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పాతకేసులు తెరిపిస్తున్నారు. ఇంతకన్నా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ నన్ను పార్టీ నుంచి బయటకు పంపుతాయి’ అని తన బ్లాగ్‌లో మయాంక్ పేర్కొన్నారు. తాను పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడం లేదని, పార్టీలో ఉన్నతవిలువలు, పారదర్శకత ఉండాలని మాత్రమే చెబుతున్నానన్నారు. -
ఆప్ నేత పై 'లైంగిక వేధింపుల' కేసు!
ముంబై: ఆప్ నాయకుడు మయాంక్ గాంధీపై క్రిమినల్ కేసు నమోదైంది. ఓ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో తాజాగా మయాంక్ గాంధీతో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో ఆప్ కార్యకర్త తరుణ్ సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆనాటి లైంగిక వేధింపుల చర్యలో ఆప్ నాయకుడు మయాంక్ తో మరో ఐదుగురి ప్రమేయం కూడా ఉందని ఆమె పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలో ప్రధాన కారకుడైన తరుణ్ సింగ్ పై లైంగిక వేధింపుల చట్టం కింద 354 సెక్షన్, స్తీలను అగౌరవపరిచాడనే ఆరోపణల కింద 509 సెక్షన్లు నమోదు చేయగా, మిగతా ఐదుగురిపై కూడా లైంగిక వేధింపుల అపరాధ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్టు అడిషనల్ కమీషనర్ మిలింద్ భరాంబే తెలిపారు. దీనిపై బాధితురాలు శనివారం పోలీసుల్ని ఆశ్రయించినట్లు కమీషనర్ తెలిపారు. కొంతమంది మహిళా పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా మయాంక్ గాంధీ లైంగిక చర్యలకు పాల్పడేవాడని ఆమె ఆరోపించింది. ఇదిలా ఉండగా ఆ ఆరోపణలను ఆప్ నేత మయాంక్ ఖండిస్తున్నాడు. రాజకీయ ఎజెండాలో భాగంగానే తనపై ఆమె ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. -
‘దృఢ ప్రభుత్వం కోసమే బీజేపీకి ఓటు’
ముంబై: ఓటర్లు ఈసారి అవినీతి కంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునే దృఢమైన ప్రభుత్వం కావాలన్న ఉద్దేశంతోనే మోడీకి ఓటేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మయాంక్ గాంధీ పేర్కొన్నారు. నగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడిన మయాంక్.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటుచేసి 49 రోజుల్లోనే గద్దె దిగిపోవడంతో కేజ్రీవాల్ బాధ్యతల నుంచి తప్పించుకున్నారనుకున్న ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదనుకున్న ఓటర్లు మోడీవైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈసారి అవినీతి అనే అంశాన్ని ప్రజలు పట్టించుకోలేదని, అయినా కూడా అప్ అన్ని స్థానాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిందని చెప్పారు. మోడీ, ఆయన పార్టీకి కార్పొరేట్ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయని ప్రజలకు తెలిసినా అది పట్టించుకోలేదన్నారు. సమర్థ, నిర్ణయాత్మక ప్రభుత్వం కావాలనుకున్నా ఓటర్లు అది మోడీ వల్లనే సాధ్యమైనా బీజేపీని ఓటేశారని వివరించారు. ‘ఢిల్లీలో ఆప్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. కేంద్ర నాయకత్వం గురించే ప్రజలు బీజేపీకి ఓటేశారు. ఎప్పడూ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆప్ స్వీప్ చేస్తుంద’ని గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తా: మయాంక్ గాంధీ
ముంబై: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో వాయవ్య ముంబై నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. ‘ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నా’అని మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీలోగా తమ పార్టీ అధిష్టానం మహారాష్ర్ట నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తుందన్నారు. అనంతరం మయాంక్ సహచరుడు అంజలి దమానియా మాట్లాడుతూ బీజేపీ అగ్రనాయకుడు నితిన్ గడ్కరీకి వ్యతిరేకంగా నాగపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. -
ఎన్సీపీ అభ్యర్థులను ఓడిస్తాం: ఆప్
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంద్వారా ఎన్సీపీ అభ్యర్థులను ఓడిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మయాంక్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా వ్యవహరించామని, కులం, మతం, ప్రాంతం వంటివాటిని దూరంగా ఉంచామని, అందువల్లనే ఢిల్లీ విధానసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అభ్యర్థుల తొలి జాబితాను తమ పార్టీ ప్రకటిస్తుందన్నారు. అయితే ఎన్ని నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. -
వెనకడుగేస్తే కాంగ్రెస్‌కే దెబ్బ
ముంబై : అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ ప్రజలు క్షమించరని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తమ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. తాము కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వారే తమకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. మద్దతుకు వారి విధించే ఎటువంటి షరతులకూ తాము ఒప్పుకునేదిలేదని ముందే చెప్పామన్నారు. ఆప్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే.. పరిస్థితి ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు అయన సమాధానమిస్తూ.. ఒకవేళ కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఢిల్లీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఏమాత్రం క్షమించబోరని ఆయన తేల్చి చెప్పారు. తాము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనలోక్‌పాల్, అవినీతిరహిత భారతదేశం లక్ష్యంగా తాము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. అయితే జాతీయ పార్టీలు తమను తక్కువ అంచనా వేశాయని, ఢిల్లీ ఎన్నికల్లో తమ ప్రభావం ఉండబోదనే ఆలోచనతో ముందుకు వెళ్లి బోర్లాపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.‘ మనం వారిని ఐదేళ్లపాటు పాలించండని ఓటేసి గెలిపించాం. అయితే వారు సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగంలేని చట్టాలను తీసుకువచ్చి, బడా పారిశ్రామికవేత్తల కొమ్ముకాశారు..’ అని ఆయన గత పార్టీల పనితీరును దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అధికార , న్యాయవ్యవస్థల పని విధానం సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేవని ఆయన విశ్లేషించారు. పోలీస్, ఉద్యోగస్వామ్యం, న్యాయవ్యవస్థల్లో మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీల అహాన్ని దెబ్బతీశాయని ఆయన వివరించారు. బీజేపీ బహిరంగ మతతత్వ పార్టీ అయితే, కాంగ్రెస్ ప్రఛన్న మతతత్వ పార్టీ అని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలు సామాన్య మానవుడిలో ఉన్న భ్రమలను తొలగించాయని ఆయన చెప్పారు. ఆప్‌ను రాజకీయ పార్టీగా కాకుండా వ్యవస్థ మార్పు నకు ఒక సూచికగా పేర్కొనవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ దేశం మొత్తం పోటీచేయనున్నట్లు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ పార్టీకి మంచి అభ్యర్థులు దొరుకుతారో, ఎక్కడ తమకు పట్టు ఉంటుందో ఆయా స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నామన్నారు. ప్రస్తుతం పార్టీకి దేశవ్యాప్తంగా 310 జిల్లాల్లో శాఖలున్నాయని చెప్పారు. తమ పార్టీ పాలనా తీరుకు, గత పార్టీల పాలనా విధానం మధ్య వ్యత్యాసాన్ని ఢిల్లీ ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునేదీ లేనిదీ ఇప్పటివరకు నిర్ణయించుకోలేదన్నారు. అయితే చాలావరకు లోకల్ పార్టీలు సైతం అవినీతిమయమై ఉన్నాయన్నారు. తమ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళుతుందని, అయితే తాము ఏ ఒక్కరి చరిష్మానో నమ్ముకుని పనిచేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మధ్య పోలికే లేదన్నారు. మోడీ కేపటలిస్టులకే ఎక్కువ సన్నిహితుడని ఆయన విశ్లేషించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు ప్రైవేట్ విద్యుత్ కంపెనీలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆ కంపెనీలపై కనీస చర్యలకు కూడా సాహసించలేదని ఆయన గుర్తుచేశారు. రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా, మహారాష్ట్రలో తమ పార్టీ మనుగడకు అన్నాహజారే, మేధా పాట్కర్ వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. ‘మేం అన్నా హజారేను గౌరవిస్తాం.. ఎందుకంటే ఆయన మార్గదర్శక సూత్రాలపైనే మా పార్టీ ఏర్పాటైంది..’ అని మయాంక్ వివరించారు. -
ముంబైలో పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ సై
ముంబై: ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబై దృష్టి సారించింది. ముంబైలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. మహారాష్ట్రలోని మిగతా స్థానాల్లో కూడా పోటీ చేయాలని భావిస్తోంది. ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ముంబైలో ఆరు లోక్‌సభ స్థానాలున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని ఆప్ సభ్యులకు ఉత్సాహాన్నిచ్చాయని వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నడుం కట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీవైపు ప్రజలు చూస్తున్నారని మయాంక్ గాంధీ అన్నారు. అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారని తెలిపారు. 15 ఏళ్లుగా హస్తినను ఏలుతున్న షీలా దీక్షిత్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ముంబైపై దృష్టి పెట్టడడంతో ప్రధాన పార్టీల్లో కలకలం మొదలయింది.