న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకత్వంపై సీనియర్ నేత మయాంక్ గాంధీ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి తొలగించడాన్ని తప్పు పట్టినందుకు పార్టీలోని కొందరు నేతలు తనను లక్ష్యంగా చేసుకున్నారని శనివారం ఆరోపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ వీడడం తప్ప మరో మార్గం లేదన్నారు. సోషల్ మీడియాలో తనను పార్టీకి, కేజ్రీవాల్‌కు వ్యతిరేకుడిగా చిత్రించే యత్నాలు సాగుతున్నాయన్నారు. ‘ప్రశాంత్, యోగేంద్రలనులను పార్టీ నుంచి తొలగించేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు.
అయితే వారు పార్టీలోనే కొనసాగుతామని వారి వ్యూహాన్ని తిప్పికొట్టారు. ఇలా చేస్తున్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో కూర్చునే కొందరు పార్టీ విధాన నిర్ణాయక నేతలు నన్ను ఇప్పటికే బీబీఎం గ్రూప్ నుంచి తొలగించారు. ఆశీష్ ఖేతాన్ వంటి నేతలు నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రలోనూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పాతకేసులు తెరిపిస్తున్నారు. ఇంతకన్నా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ నన్ను పార్టీ నుంచి బయటకు పంపుతాయి’ అని తన బ్లాగ్‌లో మయాంక్ పేర్కొన్నారు. తాను పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడం లేదని, పార్టీలో ఉన్నతవిలువలు, పారదర్శకత ఉండాలని మాత్రమే చెబుతున్నానన్నారు.