డ్రామాలు చేయకు.. ప్రధాని ఆలోచన మానుకో!
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన సన్నిహితుడొకరు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ సన్నిహిత అనుచరుడైన ఆప్ మాజీ నేత మయాంక్ గాంధీ తాజాగా తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ బహిరంగ లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను హీరో, రాజకీయ నాయకుడిగా సంబోధిస్తూ ఆయన రాసిన ఈ లేఖలో ఆప్ తాజా ఘోర పరాభవం అహంకారానికి తగిలిన ఎదురుదెబ్బగా అభివర్ణించారు.
'రాజీపడటమే ఎరుగని ఒకప్పటి నిస్వార్థ హీరో అరవింద్ ఇప్పుడు బతికిలేడు. అతని స్థానంలో 2019లో ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో అందుకు అనుగుణంగా మద్దతును పొందాలనుకుంటున్న రాజకీయ నాయకుడు మాత్రమే ఉన్నాడు' అని మయాంక్ విమర్శించారు. 'సొంత అహంకారం, అంతర్గత రాజకీయ కుమ్ములాటల్లో మనం ఇతర పార్టీలను ఓడించాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఢిల్లీ ముఖ్యమంత్రిగా, పార్టీ కన్వీనర్‌గా పగ్గాలు చేపట్టడం ద్వారా పూర్తి అధికారాన్ని నీ చేతుల్లోనే పెట్టుకున్నావు. ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించడానికి ఇంకెంత అధికారం నీకు కావాలి?' అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో పోరాడటానికే ఆప్ పురుడు పోసుకున్నదని, కానీ అలాంటి మరో పార్టీగా మిగలడానికి కాదని హితవు పలికారు. ప్రధానమంత్రి కావాలన్న జాతీయ ఆశయాలను పక్కనబెట్టి ఇకనైన ఢిల్లీలో మెరుగైన పాలన అందించాలని, డ్రామాలు, ఇతరులను నిందించడాలు ఆపాలని ఆయన సూచించారు.