ఆప్ నేత పై 'లైంగిక వేధింపుల' కేసు!
ముంబై: ఆప్ నాయకుడు మయాంక్ గాంధీపై క్రిమినల్ కేసు నమోదైంది. ఓ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో తాజాగా మయాంక్ గాంధీతో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో ఆప్ కార్యకర్త తరుణ్ సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆనాటి లైంగిక వేధింపుల చర్యలో ఆప్ నాయకుడు మయాంక్ తో మరో ఐదుగురి ప్రమేయం కూడా ఉందని ఆమె పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనలో ప్రధాన కారకుడైన తరుణ్ సింగ్ పై లైంగిక వేధింపుల చట్టం కింద 354 సెక్షన్, స్తీలను అగౌరవపరిచాడనే ఆరోపణల కింద 509 సెక్షన్లు నమోదు చేయగా, మిగతా ఐదుగురిపై కూడా లైంగిక వేధింపుల అపరాధ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్టు అడిషనల్ కమీషనర్ మిలింద్ భరాంబే తెలిపారు. దీనిపై బాధితురాలు శనివారం పోలీసుల్ని ఆశ్రయించినట్లు కమీషనర్ తెలిపారు. కొంతమంది మహిళా పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా మయాంక్ గాంధీ లైంగిక చర్యలకు పాల్పడేవాడని ఆమె ఆరోపించింది. ఇదిలా ఉండగా ఆ ఆరోపణలను ఆప్ నేత మయాంక్ ఖండిస్తున్నాడు. రాజకీయ ఎజెండాలో భాగంగానే తనపై ఆమె ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు.