హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కు 'జడ్' కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: తనకు జడ్ కేటగిరి భద్రత కల్పించుకోవడాన్ని మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమానాథ్ సింగ్ సమర్థించుకున్నారు. తనకు ప్రాణహాని ఉన్నందునే జడ్ కేటగిరి రక్షణ పొందానని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తనను జడ్ కేటగిరి భద్రత కల్పించాలని ఆయనే ఆదేశాలు జారీచేశారు. దీనిపై పలువురు ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు ఈ పిటిషన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. స్పందన తెలపాలని మేఘాలయ ప్రభుత్వాన్ని కోరింది.
జస్టిస్ ఉమానాథ్ సింగ్ గతేడాది సెప్టెంబర్ 28న తన వివరణను సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ లేఖను పిటిషనర్ న్యాయవాదికి, మేఘాలయ ప్రభుత్వానికి ఇవ్వాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. తన చర్యను ఉమానాథ్ సింగ్ సమర్థించుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా తనకు జడ్ కేటగిరి కొనసాగించేలా మేఘాలయ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.