ఎక్స్‌గ్రేషియా రూ.6 లక్షలకు పెంపు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ బీమా పథకం కింద ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కేంద్ర ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ట్రస్టీల సమావేశం అనంతరం దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు.
డిపాజిట్ లింక్డ్ బీమా పథకం ద్వారా ప్రస్తుతం కార్మికుల కుటుంబాలకు రూ.3.60 లక్షలు మాత్రమే అందుతోందని పేర్కొన్నారు. దీనివల్ల 4 కోట్ల మంది భవిష్యత్‌నిధి చందాదారులకు(ఈపీఎఫ్) లబ్ధి చేకూరుతుందన్నారు. సంవత్సరంపాటు తప్పనిసరిగా ఉద్యోగం చేసుండాలన్న నిబంధనను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పారదర్శకతతో ఉద్యోగుల భవిష్యనిధి కార్యకలాపాలను నిర్వహించడానికి మొబైల్ అప్లికేషన్ రూపొందించామన్నారు.
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ విశిష్ట ఖాతానంబర్, భవన నిర్మాణ కార్మికులందరికీ ఈపిఎఫ్ వర్తింపచేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమనిధి వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించని రాష్ట్రాల కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేయడంతోపాటు, ఆయా రాష్ట్రాల నిధులను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ తెలిపారు.