ఇక ఖరీదైన రైళ్లలో పెళ్లిళ్లు
న్యూఢిల్లీ: వినూత్నంగా, విలాసవంతంగా వివాహం చేసుకోవాలనుకునే జంటలకు శుభవార్త. భారతీయ రైల్వేకు చెందిన క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ తమ లగ్జరీ రైళ్లను పెళ్లి వేడకులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్పొరేషన్ ప్రపంచ పర్యాటకుల కోసం లగ్జరీ, సెమీ లగ్జరీ రైళ్లను ఇప్పటికే నడుపుతున్న విషయం తెల్సిందే. వీటిలో అత్యంత ఖరీదైన మహారాజా ఎక్స్‌ప్రెస్ 8 రోజుల ప్యాకేజీపైనా ఢీల్లీ, ఆగ్ర, రంథంబోర్, జైపూర్, బికనూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బెలాసినార్‌ల కోటలు, చారిత్రక కట్టడాల సందర్శన కోసం పర్యాటకుల కోసం నడుపుతోంది.
ఇప్పుడు పెళ్లిళ్ల కోసం మహారాజా ఎక్స్‌ప్రెస్‌తోపాటు ప్యాలెస్ ఆన్ వీల్స్, డెక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రైళ్లను కేటాయించాలని కార్పొరేషన్ నిర్వహించింది. పెళ్లిళ్లకు, వేడికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రైలు డెకరేషన్‌ను మార్చేందుకు, అతిథులకు పసందైన విందు భోజనాలతోపాటు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు నిపుణులైన ఈవెంట్ మేనేజర్లు ఉంటారని కార్పొరేషన్ సీనియర్ అధికారులు తెలిపారు.
రైళ్లలో విహరిస్తూనే పెళ్లి చేసుకోవచ్చని, వధూవరుల హానిమూన్‌కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయని వారు చెప్పారు. ఎన్నిరోజుల బస, ఉపయోగించుకునే వసతులు, ప్యాకేజీల ఆధారంగా రేట్లు ఉంటాయని వారు అన్నారు. విలాసవంతమైన రైళ్లలో ‘స్పా’ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయని, భారతీయులు, ప్రవాస భారతీయలకే కాకుండా విదేశీ జంటల వివాహాలకు కూడా తాము రైళ్లను కేటాయిస్తామని వారు చెప్పారు. తాము వినూత్నంగా త్వరలోనే ప్రారంభించనున్న ఈ స్కీమ్ విజయవంతమవుతుందన్న విశ్వాసంతో ఉన్నామని వారు చెప్పారు.