ఇది రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. రాయల్ ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి!
జైపూర్: కరోనా కారణంగా నిలిచిపోయిన విలాసవంతమైన పర్యాటక రైలు (రాయల్ ట్రైన్) తిరిగి రెండేళ్ల తర్వాత పట్టాలెక్కింది. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’గా పేరుగాంచిన ఈ ట్రైన్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శనివారం గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. గత 40 ఏళ్లగా రాయల్ ట్రైన్ పర్యాటకులను ఆకట్టుకుంటోందని, ఇది ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైలు సేవలను తిరిగి ప్రారంభించటంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాయల్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు ముందు.. అందులోని వసతులపై ఆరా తీశారు సీఎం గెహ్లోత్. ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రైలు సర్వీసును తిరిగి ప్రారంభించటం ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రైలులో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, 2022-23 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.
40 ఏళ్ల ఘన చరిత్ర..: దేశంలో గత 40 ఏళ్లుగా రాయల్(ప్యాలెస్ ఆన్ వీల్స్) ట్రైన్ సేవలందిస్తోంది. తొలిసారి ఈ రాయల్ ట్రైన్ 1982లో పట్టాలెక్కింది. రైల్ గేజ్‌లను సమయానుసారంగా మారుస్తూ వస్తున్న క్రమంలో రెండో రాయల్ ట్రైన్‌ను 1991లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడోది 1995లో పట్టాలెక్కినట్లు అధికారులు తెలిపారు. తర్వాత రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌తో కలిసి 2009లో అధునాత సౌకర్యాలతో పునరుద్ధరించింది రైల్వే శాఖ. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే భావన కోచ్‌ల్లో రాచరిక నేపథ్యం నుంచి వచ్చింది. వాస్తవానికి రాజ్‌పుత్‌లు, బరోడా, హైదరాబాద్ నిజాం సహా బ్రిటిష్ వైస్రాయ్‌ల వ్యక్తిగత రైల్వే కోచ్‌లుగా వీటిని ఉద్దేశించినట్లు చరిత్ర చెబుతోంది.
ఇంటీరియర్ డిజైన్..: ప్రతి బోగిలో ఫర్నిచర్, హస్తకళలు, పెయింటింగ్ వంటి వాటి వాడకం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక నైతికతను హైలైట్ చేస్తుంది. జైపూర్‌కు చెందిన నిష్ణాతులైన ఆర్కిటెక్ట్స్ రైలు ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది.
సౌకర్యాలు..: ఈ రాయల్ ట్రైన్‌లో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. 104 మంది టూరిస్టులు ఇందులో ఏకకాలంలో ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్‌కు రాజ్‌పుత్‌ల పేర్లు పెట్టారు. ఒక్కో బోగీలో లగ్జరీ సౌకర్యాలు, వైఫై ఇంటర్‌నెట్ వంటివాటితో నాలుగు క్యాబిన్లు ఉంటాయి. ఈ రైలులో ద మహారాజ, ద మహారాణి అనే రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే.. ఒక బార్ కమ్ లాంజ్, 14 సెలూన్లు, ఒక స్పా ఉన్నాయి.
ఏ రూట్లలో వెళ్తుంది..: ఈ రైలు మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్(రెండో రోజు), సవాయ్ మాధోపుర్, ఛిత్తౌర్‌గఢ్(మూడో రోజు), ఉదయ్ పూర్(నాలుగో రోజు), జైసల్మేర్(ఐదోరోజు), జోధ్‌పుర్ (ఆరో రోజు), భరత్‌పుర్, ఆగ్రా(ఏడో రోజు), తిరిగి ఎనిమిదో రోజు న్యూఢిల్లీకి చేరుకుంటుంది.
ఇదీ చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..
Comments
Please login to add a commentAdd a comment