luxury trains
-
‘ప్యాలెస్ ఆన్ వీల్స్’.. రాజ భోగాల ప్రయాణం.. రెండేళ్ల తర్వాత కూత..!
ఇది రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. రాయల్ ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి! జైపూర్: కరోనా కారణంగా నిలిచిపోయిన విలాసవంతమైన పర్యాటక రైలు (రాయల్ ట్రైన్) తిరిగి రెండేళ్ల తర్వాత పట్టాలెక్కింది. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’గా పేరుగాంచిన ఈ ట్రైన్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శనివారం గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. గత 40 ఏళ్లగా రాయల్ ట్రైన్ పర్యాటకులను ఆకట్టుకుంటోందని, ఇది ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైలు సేవలను తిరిగి ప్రారంభించటంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు ముందు.. అందులోని వసతులపై ఆరా తీశారు సీఎం గెహ్లోత్. ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రైలు సర్వీసును తిరిగి ప్రారంభించటం ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రైలులో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, 2022-23 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 40 ఏళ్ల ఘన చరిత్ర..: దేశంలో గత 40 ఏళ్లుగా రాయల్(ప్యాలెస్ ఆన్ వీల్స్) ట్రైన్ సేవలందిస్తోంది. తొలిసారి ఈ రాయల్ ట్రైన్ 1982లో పట్టాలెక్కింది. రైల్ గేజ్‌లను సమయానుసారంగా మారుస్తూ వస్తున్న క్రమంలో రెండో రాయల్ ట్రైన్‌ను 1991లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడోది 1995లో పట్టాలెక్కినట్లు అధికారులు తెలిపారు. తర్వాత రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌తో కలిసి 2009లో అధునాత సౌకర్యాలతో పునరుద్ధరించింది రైల్వే శాఖ. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే భావన కోచ్‌ల్లో రాచరిక నేపథ్యం నుంచి వచ్చింది. వాస్తవానికి రాజ్‌పుత్‌లు, బరోడా, హైదరాబాద్ నిజాం సహా బ్రిటిష్ వైస్రాయ్‌ల వ్యక్తిగత రైల్వే కోచ్‌లుగా వీటిని ఉద్దేశించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంటీరియర్ డిజైన్..: ప్రతి బోగిలో ఫర్నిచర్, హస్తకళలు, పెయింటింగ్ వంటి వాటి వాడకం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక నైతికతను హైలైట్ చేస్తుంది. జైపూర్‌కు చెందిన నిష్ణాతులైన ఆర్కిటెక్ట్స్ రైలు ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది. సౌకర్యాలు..: ఈ రాయల్ ట్రైన్లో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. 104 మంది టూరిస్టులు ఇందులో ఏకకాలంలో ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్‌కు రాజ్‌పుత్‌ల పేర్లు పెట్టారు. ఒక్కో బోగీలో లగ్జరీ సౌకర్యాలు, వైఫై ఇంటర్నెట్ వంటివాటితో నాలుగు క్యాబిన్లు ఉంటాయి. ఈ రైలులో ద మహారాజ, ద మహారాణి అనే రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే.. ఒక బార్ కమ్ లాంజ్, 14 సెలూన్లు, ఒక స్పా ఉన్నాయి. ఏ రూట్లలో వెళ్తుంది..: ఈ రైలు మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్(రెండో రోజు), సవాయ్ మాధోపుర్, ఛిత్తౌర్గఢ్(మూడో రోజు), ఉదయ్ పూర్(నాలుగో రోజు), జైసల్మేర్(ఐదోరోజు), జోధ్‌పుర్ (ఆరో రోజు), భరత్‌పుర్, ఆగ్రా(ఏడో రోజు), తిరిగి ఎనిమిదో రోజు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఇదీ చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని.. -
ఖరీదైన ప్రయాణం.. కనుమరుగు?
సురక్షితంగా, తక్కువ ఖర్చుతో జర్నీ చేయాలంటే సహజంగానే అందరూ రైలు ప్రయాణం వైపే మొగ్గుచూపుతారు. కేవలం సామాన్యుల అవసరాల కోసమే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఖరీదైన ప్రయాణాన్ని అందిస్తోన్న రైళ్లు కూడా భారత్‌లో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా రాజభోగాలు అనుభవించాలంటే ఆ ట్రైన్లు ఎక్కాల్సిందే! అయితే ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పర్యటిస్తున్న కొన్ని ట్రైన్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటకప్రియుల కోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్ ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ఒకటైన ‘ప్యాలస్ ఆన్ వీల్స్’ గత 34 ఏళ్లలో తొలిసారిగా ఆగిపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అలాంటి లగ్జరీ రైళ్లు ఏమిటో మీకు తెలుసా...? ప్యాలెస్ ఆన్ వీల్స్.. భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్‌వీల్స్. తొలినాళ్లలో ఖరీదైన రైలు ప్రయాణాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. చారిత్రక వైభవం ఉట్టిపడేలా దీని ఇంటీరియర్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇది రాజస్తాన్ పర్యాటక శాఖ, ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఇందులోని 14 బోగీలకు రాజస్తాన్‌లోని 14 సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. 1991లో దీనికి ఏసీ ఏర్పాటు చేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు. ఎనిమిది రోజుల ప్యాకేజీ ధర రోజుకు ఒకరికి రూ. 22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే రూ. 33,000. ముగ్గురు పంచుకుంటే రూ. 45,000 వసూలు చేస్తారు. రాయల్ రాజస్తాన్.. ఇది ప్యాలెస్ ఆన్వీల్స్కు సమాంతర ప్రాజెక్ట్. 2009 జనవరిలో ప్రారంభమైంది. రాజపుత్రుల అంతఃపురాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక అలంకరణలను దీనికి ఇంటీరియర్ డిజైన్‌గా ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఆదివారం వరకు కొనసాగే ఈ ప్రయాణం ఢిల్లీ, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘఢ్, సవై మదోపూర్, జైపూర్, ఖజురహో, వారణాసి, ఆగ్రా, ఢిల్లీల్లో ప్రయాణిస్తుంది. ఇద్దరు కలిసి ఒక గది తీసుకుంటే రోజుకు ఒకరికి రూ. 26,000 చెల్లించాలి. ఎక్స్ట్రార్డినరీ సూట్‌కు రోజుకు రూ. 75,000 వరకు చార్జ్ చేస్తారు. ది గోల్డెన్ చారియట్.. కర్ణాటక, గోవాల్లో అందాలను తిలకించేందుకు రూపొందించిన ప్యాకేజీ. 2008 మార్చిలో ప్రారంభమైంది. ఇండియన్ రైల్వే అండ్ కర్ణాటక టూరిజమ్‌లు సంయుక్తంగా రెండు రకాల ప్యాకేజీలను నిర్వహిస్తున్నాయి. ప్రతి సోమవారం బెంగళూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కబిని, బందీపూర్, మైసూర్, హసన్, హూస్పేట్, బాదామి, గోవాల మీదుగా ప్రయాణిస్తుంది. ఒక గదిని ఇద్దరు షేర్ చేసుకుంటే ఒకరికి రోజుకు రూ. 18,000 చార్జ్ చేస్తారు. ఇండియాలో నడుస్తున్న ఖైరీదైన రైళ్లలో ఇదే కాస్త ధర తక్కువ. మహారాజా ఎక్స్‌ప్రెస్.. 2010లో ప్రారంభమైన ఈ రైలును ఇండియన్ రైల్వే గ్లోబల్ ట్రావెల్ కంపెనీ, కాక్స్ అండ్ కింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాజుల వైభవానికి ఆధునికతను మిక్స్ చేసి దీన్ని రూపొందించారు. ఫెయిరీ క్వీన్.. 1855లో ఇంగ్లండ్‌లో తయారైన ఈరైలు ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ లోకోమోటివ్. 1909లో కాలం చెల్లిన ఈ ట్రైన్‌ను బాగుచేసి 1997 జులైలో మళ్లీ పట్టాలెక్కించారు. ఇది ఢిల్లీ ఆల్వార్ సరిస్కా (పులుల కేంద్రం), ఢిల్లీ ప్యాకేజీలను నిర్వహిస్తోంది. రెండు రోజుల ప్యాకేజీ ధర ఒకరికి రూ. 11,000 సదుపాయాలు.. ప్రతి గదికి ప్రత్యే ఏసీతో సెవెన్ స్టార్ సదుపాయాలతో బెడ్రూమ్ ఉంటుంది. ప్రతి ట్రైన్లో ఒకబార్, రెండు రెస్టారెంట్లు ఉంటాయి. లైబ్రరీ, షాపింగ్, విశ్రాంతి గది, జిమ్, అవుట్గోయింగ్ పోస్ట్, ఫోను, ఇంటర్నెట్, ఎల్సీడీ టీవీలు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ వేడి , చల్లటి నీరు అందుబాటులో ఉంటుంది.