ఖరీదైన ప్రయాణం.. కనుమరుగు? | Barring Maharajas' Express, India’s luxury trains face low occupancy | Sakshi
Sakshi News home page

ఖరీదైన ప్రయాణం.. కనుమరుగు?

Published Wed, Apr 20 2016 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

Barring Maharajas' Express, India’s luxury trains face low occupancy

సురక్షితంగా, తక్కువ ఖర్చుతో జర్నీ చేయాలంటే సహజంగానే అందరూ రైలు ప్రయాణం వైపే మొగ్గుచూపుతారు. కేవలం సామాన్యుల అవసరాల కోసమే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఖరీదైన ప్రయాణాన్ని అందిస్తోన్న రైళ్లు కూడా భారత్‌లో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా రాజభోగాలు అనుభవించాలంటే ఆ ట్రైన్లు ఎక్కాల్సిందే! అయితే ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పర్యటిస్తున్న కొన్ని ట్రైన్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటకప్రియుల కోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్ ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ఒకటైన ‘ప్యాలస్ ఆన్ వీల్స్’ గత 34 ఏళ్లలో తొలిసారిగా ఆగిపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అలాంటి లగ్జరీ రైళ్లు ఏమిటో మీకు తెలుసా...?

 
ప్యాలెస్ ఆన్ వీల్స్..

భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్‌వీల్స్. తొలినాళ్లలో ఖరీదైన రైలు ప్రయాణాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. చారిత్రక వైభవం ఉట్టిపడేలా దీని ఇంటీరియర్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇది రాజస్తాన్ పర్యాటక శాఖ, ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఇందులోని 14 బోగీలకు రాజస్తాన్‌లోని 14 సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. 1991లో దీనికి ఏసీ ఏర్పాటు చేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు. ఎనిమిది రోజుల ప్యాకేజీ ధర రోజుకు ఒకరికి రూ. 22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే రూ. 33,000. ముగ్గురు పంచుకుంటే రూ. 45,000 వసూలు చేస్తారు.

రాయల్ రాజస్తాన్..
ఇది ప్యాలెస్ ఆన్‌వీల్స్‌కు సమాంతర ప్రాజెక్ట్. 2009 జనవరిలో ప్రారంభమైంది. రాజపుత్రుల అంతఃపురాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక అలంకరణలను దీనికి ఇంటీరియర్ డిజైన్‌గా ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఆదివారం వరకు కొనసాగే ఈ ప్రయాణం ఢిల్లీ, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘఢ్, సవై మదోపూర్, జైపూర్, ఖజురహో, వారణాసి, ఆగ్రా, ఢిల్లీల్లో ప్రయాణిస్తుంది. ఇద్దరు కలిసి ఒక గది తీసుకుంటే రోజుకు ఒకరికి రూ. 26,000 చెల్లించాలి. ఎక్స్‌ట్రార్డినరీ సూట్‌కు రోజుకు రూ. 75,000 వరకు  చార్జ్ చేస్తారు.

ది గోల్డెన్ చారియట్..

కర్ణాటక, గోవాల్లో అందాలను తిలకించేందుకు రూపొందించిన ప్యాకేజీ. 2008  మార్చిలో ప్రారంభమైంది. ఇండియన్ రైల్వే అండ్ కర్ణాటక టూరిజమ్‌లు సంయుక్తంగా రెండు రకాల ప్యాకేజీలను నిర్వహిస్తున్నాయి. ప్రతి సోమవారం బెంగళూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కబిని, బందీపూర్, మైసూర్, హసన్, హూస్పేట్, బాదామి, గోవాల మీదుగా ప్రయాణిస్తుంది. ఒక గదిని ఇద్దరు షేర్ చేసుకుంటే ఒకరికి రోజుకు రూ. 18,000 చార్జ్ చేస్తారు. ఇండియాలో నడుస్తున్న ఖైరీదైన రైళ్లలో ఇదే కాస్త ధర తక్కువ.

మహారాజా ఎక్స్‌ప్రెస్..

2010లో ప్రారంభమైన ఈ రైలును ఇండియన్ రైల్వే గ్లోబల్ ట్రావెల్ కంపెనీ, కాక్స్ అండ్ కింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాజుల వైభవానికి ఆధునికతను మిక్స్ చేసి దీన్ని రూపొందించారు.

ఫెయిరీ క్వీన్..

1855లో ఇంగ్లండ్‌లో తయారైన ఈరైలు ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ లోకోమోటివ్. 1909లో కాలం చెల్లిన ఈ ట్రైన్‌ను బాగుచేసి 1997 జులైలో మళ్లీ పట్టాలెక్కించారు. ఇది ఢిల్లీ ఆల్వార్ సరిస్కా (పులుల కేంద్రం), ఢిల్లీ ప్యాకేజీలను నిర్వహిస్తోంది. రెండు రోజుల ప్యాకేజీ ధర ఒకరికి రూ. 11,000

సదుపాయాలు..
ప్రతి గదికి ప్రత్యే ఏసీతో సెవెన్ స్టార్ సదుపాయాలతో బెడ్‌రూమ్ ఉంటుంది. ప్రతి ట్రైన్‌లో ఒకబార్, రెండు రెస్టారెంట్లు ఉంటాయి. లైబ్రరీ, షాపింగ్, విశ్రాంతి గది, జిమ్, అవుట్‌గోయింగ్ పోస్ట్, ఫోను, ఇంటర్నెట్, ఎల్‌సీడీ టీవీలు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ వేడి , చల్లటి నీరు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement