రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నారు. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ జేజీఎం డీఎస్‌జీపీ కిశోర్ మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు. ఈ యాత్రతో పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏపీ, తెలంగాణలోని యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి బయలుదేరే ఈ రైలుకు ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ స్టేషన్‌ల్లో ఆగనుంది.
12 రాత్రులు, 13 పగళ్లు సాగే ఈ యాత్రలో ఉజ్జయిని, మహాకాళేశ్వర దేవాలయం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకాదిస్ దేవాలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్, భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం, గ్రిషినేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తదితర పూణ్యక్షేత్రలు, పర్యాటక, చారిత్రక ప్రదేశాలను దర్శించుకోవచ్చు.
యాత్రలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి. 3 కేటగిరీల్లో ఉండే ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఎకానమీ (స్లీపర్ క్లాస్) రూ. 21,000, స్టాండర్డ్ (3 ఏసీ) రూ.32,500, కంఫర్ట్ (2 ఏసీ) రూ. 42,500 ధరగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా విజయవాడ కార్యాలయం 8287932312, 9281495848 నంబర్లకు సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment