విలాసవంతమైన ప్రయాణం...పట్టాలపైన ప్యాలెస్...
మహారాజా ఎక్స్‌ప్రెస్... ప్రయాణించేది రైల్వే లైన్ మీద కాదు నాటి చారిత్రక ప్రపంచంలోకి. మహారాజా ఎక్స్‌ప్రెస్... కేవలం రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. మహారాజా ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘వీల్స్ ఆన్ ట్రెయిన్.’ రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి!
ప్యాలెస్ రైలు పట్టాల మీద పరుగులు తీస్తుంటే ఎలా ఉంటుందో చూడాలంటే రాజస్థాన్ లగ్జరీ టూరిస్ట్ ట్రెయిన్‌ను వీక్షించాలి. ఒక్కరోజైనా ఈ రైలులోని సకల సదుపాయాలను పొందాలని కోరుకుంటారు సంపన్ను లు. రోజుకు లక్షల రూపాయలు చెల్లించే ఈ రైలులో ప్రయా ణం అత్యంత విలాసవంతంగా ఉంటుంది.
అడుగడుగునా.. రాచకళ...
ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ రైలులో 14 క్యాబిన్లు ఉన్నాయి. వీటిలో అడుగుపెట్టగానే సుశిక్షితులైన నిపుణులు తీర్చిదిద్దిన అందచందాలు వర్ణనాతీతం. వీటిలో ఎక్కువగా హస్తకళా నైపుణ్యంతో తయారుచేసిన కళాకృతులు చూపు తిప్పుకోనివ్వవు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది.
దర్జాగా...విందు భోజనం!
14 క్యాబిన్లలో కొన్నింటికి హవామహల్, పద్మినిమహల్, కిశోరి మహల్, ఫూల్ మహల్, తాజ్‌మహల్.. అని పేరు పెట్టారు. స్వర్ణ్ మహల్, శీష్ మహల్ క్యాబిన్‌లలో విందుభోజనం ఉంటుంది. స్వర్ణ్ మహల్‌లో పూర్తిగా బ్రాస్, బంగారు తాపడాలతో రాచఠీవీని ఒలక బోస్తుంది. ఇక శీష్ మహల్ రెస్టారెంట్ ఫ్లోర్ ల్యాంప్స్, క్రిస్టల్ ఫిలమెంట్స్ తో ధగధగలాడుతూ ఉంటుంది. ఈ మహల్స్‌లో ఒక్కసారైనా భోజనం చేయాలని పర్యాటకులు ఉవ్విల్లూరుతుంటారు. దీంట్లో రాజస్థానీ, ఇండియన్, చైనీస్ రుచులు నోరూరిస్తుంటాయి. భటులను తలపించే సేవకులతో పూర్తిగా రాచరికాన్ని అనుభవించవచ్చు.
మణి మరకతాల పడకగదులు
విశాలమైన, సౌకర్యవంతమైన రాయల్ సూట్‌లో పట్టు పరుపులు, మఖమల్ బెడ్ షీట్స్ హాయిగొలిపే నిద్రకు ఆసనంగా మారతాయి. బెడ్స్‌తో పాటు సోఫా-కుర్చీలు, రాసుకోవడానికి బల్ల ఉంటాయి. వీటిలో వజ్రం, మరకతాల నేపథ్యాన్ని ఉపయోగించడం ప్రత్యేకత. ఈ సూపర్ డీలక్స్ సూట్ మరింత విలాస వంతంగా రూపొందిం చారు. డీలక్స్ సూట్‌లో అడుగు పెట్టగానే మీకు మాత్రమే ప్రత్యేకమైన చాంబర్ ఆహ్వానం పలుకుతుంది. పట్టు ఫర్నిషింగ్‌తో తీర్చిదిద్దిన ఫర్నిచర్... రంగులు, డిజైన్లు నాటి కాలంలోకి తీసుకెళతాయి. సకల సదుపాయాలు దీంట్లో లభ్యం. కెంపు, ముత్యం, నీలం రంగుల మేళవింపుతో దీనిని డిజైన్ చేశారు.
ఖరీదైన వైన్!
భోజనంతో పాటు అత్యంత ఖరీదైన వైన్ ఇక్కడ లభిస్తుంది. అన్ని అంతర్జాతీయ బ్రాండ్ల లిక్కర్‌ను ఇక్కడ సర్వ్ చేస్తారు. శీష్‌మహల్, స్వర్ణ్‌మహల్‌లలో ఈ సౌలభ్యం ఉంది. అపెర్టిఫ్, మాల్ట్, విస్కీ, స్కాచ్, రమ్, వోడ్కా, షాంపేన్... లను ఇక్కడ సర్వ్ చేస్తారు.
స్పా.. శాటిలైట్..
ఈ రైలులోని రాయల్ స్పా ప్రత్యేకమైనది. అధునాతనమైనది. బయట లగ్జరీ స్పాలలో లభించే మసాజ్, బ్యూటీ థెరపీలు.. అన్నీ వీటిలో లభిస్తాయి. వై-ఫై ఇంటర్‌నెట్, శాటిలైట్ టీవీ, మ్యూజిక్ సిస్టమ్, ఉష్ణోగ్రతలు నియంత్రించుకోగలిగే సామర్థ్యం ప్రతి క్యాబిన్‌లోనూ ఉంటాయి.
ప్రయాణ ప్యాకేజీ...
ఏడు పగళ్లు, ఎనిమిది రాత్రులలో ఢిల్లీ నుంచి రాజస్థాన్ అంతా చుట్టి వచ్చేలా దీనిని డిజైన్ చేశారు. న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై 2వ రోజుకు జోధ్‌పూర్, 3వ రోజుకు ఉదయపూర్, 4వ రోజుకు చిత్తోడ్‌ఘడ్, రణథమ్‌బోర్ నేషనల్ పార్క్, జైపూర్, 5వ రోజుకు ఖజురహో, 6వ రోజులకు సారనాథ్, 7వ రోజుకు ఆగ్రా చేరుకొని, అటు నుంచి 8వ రోజుకు తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది. అబ్బురపరిచే హవామహల్, మోతీ మహల్, శీష్ మహల్, రణథమ్‌బోర్ ఉద్యానం, చిత్తాఘడ్ కోట, జగ్ నివాస్ (లేక్ ప్యాలెస్), కియోలాడియో నేషనల్ పార్క్, ఆగ్రా కోట, చివరగా తాజ్‌మహల్‌ను వీక్షించవచ్చు. ఢిల్లీ నుంచి బయల్దేరేటప్పటి నుంచి ఊహలకు అందని ఆనందాన్ని ప్రయాణం పొడవునా ఏడు రోజుల పాటు పొందవచ్చు. రాజస్థాన్‌లోని అటవీ సంపదను, అందులోని వన్యప్రాణులను, ప్రాచీన వారసత్వ కట్టడాలను కళ్లారా వీక్షించవచ్చు. జీవిత కాలంలో అత్యంత ఆనందకర జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి ఈ రాయల్ చక్రాలపై ప్రయాణం చేయాల్సిందే!
8 పగళ్లు/7 రాత్రులకు ప్యాకేజీ! (ఒకరికి)
డీలక్స్ క్యాబిన్: రూ. 3,62,328/-
జూనియర్ సూట్: రూ. 5,73,181/-
సూట్: రూ. 8,36,142 /-
ప్రెసిడెన్షియల్ సూట్: రూ. 14,35,983/-