వాషింగ్టన్: మధుమేహం నివారణ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు ఓ కీలక ముందడుగు వేశారు. ఎలుకల్లో చర్మ కణాలను క్లోమ కణాలుగా మార్చి వాటి ద్వారా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయగలిగారు. దీంతో భవిష్యత్తులో టైప్1 మధుమేహ వ్యాధికి సమర్థమైన, శాశ్వత చికిత్సకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. సాధారణంగా క్లోమంలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తుంటాయి. ఈ బీటా కణాలు నాశనం అయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. అయితే ఇన్సులిన్ లేకపోతే శరీర కణాలు గ్లూకోజ్ చక్కెరలను స్వీకరించలేవు కాబట్టి.. టైప్1 మధుమేహ సమస్య ఉత్పన్నం అవుతుంది.
ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్తులు రోజూ క్రమం తప్పకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో క్లోమంలో బీటా కణాలను పునరుద్ధరించే దిశగా పరిశోధన మొదలుపెట్టిన గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మొదటి దశలో విజయం సాధించారు. ఎలుకల చర్మంలోని ఫైబ్రోబ్లాస్ట్ కణాలను సేకరించి వాటిని వివిధ కణాల మిశ్రమం సాయంతో ఎండోడర్మ్ కణాల మాదిరిగా మార్చారు. తొలిదశ పిండం లోపలి పొరలో ఉండే ఎండోడర్మ్ కణాలే తర్వాత శరీరంలో క్లోమంతోసహా వివిధ అవయవాలను ఏర్పరుస్తాయి.