
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మహిళ దారుణహత్య.. ప్రియుడే కాలయముడు
ఖమ్మం: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తున్న గంధం కళావతి(45)కి 20 ఏళ్ల క్రితం ఓ కానిస్టేబుల్‌తో పెళ్లయింది. వీరికి ఓ కొడుకున్నాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఖమ్మంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కళావతి జీవిస్తుంది. ఆమెతోపాటు ఆమె కుమారుడు ఉంటున్నాడు. కొడకు రాజేష్ (18) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రవీణ్‌తో కళావతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. మద్యం తాగి కళావతిని ప్రవీణ్ నిత్యం వేధించేవాడు. తన తల్లిని వేధించడం మానుకోవాలని రాజేష్ హెచ్చరించినా.. ప్రవీణ్‌లో మార్పురాలేదు. బుధవారం రాత్రి కుమారుడు ఇంటికి వచ్చే సరికి గదిలో కళావతి చాపమీద నిర్జీవంగా పడి ఉంది. వెంటనే రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్థానికులు విచారించగా ఉదయం నుంచి ప్రవీణ్ ఆమెతోనే ఉన్నట్లు, ఆమెతో గొడవ జరిగినట్లు తెలిపారు. తన తల్లిని ప్రవీణే చంపాడని పోలీసులకు రాజేష్ ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ ఆమెతో గొడవపడి వెనుక గదికి తీసుకోని వచ్చి ముఖంపై దిండు పెట్టి హత్య చేసి ఉండొచ్చని తేదా గొంతు నులిమి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.