పోలీసుల దుస్తుల్లో వచ్చారు.. వస్తూనే.. !
అమృతసర్: కరుడుగట్టిన ఖలీస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూ జైలు నుంచి పరార్ కావడంతో పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో వచ్చిన సాయుధులు నబా జైలుపై దాడి చేసి.. హర్మిందర్ సింగ్‌తోపాటు మరో నలుగురు గ్యాంగ్‌స్టర్లను విడిపించుకుపోయారు. ఈ సందర్భంగా వందరౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్టు సమాచారం. సాయుధులు దాడి చేసి.. అత్యంత భద్రత నడుమ ఉన్న కీలక తీవ్రవాద సూత్రధారిని జైలు నుంచి విడిపించుకొనిపోవడం తీవ్ర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన, అనంతర పరిణామాలపై పంజాబ్ డీజీపీ, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ భేటీ అయి చర్చించారు.
మరోవైపు ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనపై పలు వివరాలు తెలిపారు. దాదాపు 20 మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో జైలును ముట్టడించారని, వస్తూనే పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూ విరుచుకుపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాయుధుల్లో ఒకడు ఏఎస్‌ఐ యూనిఫాం వేసుకోగా, మిగతావారు పోలీసు దుస్తులు వేసుకున్నారని చెప్పారు. మరోవైపు తప్పించుకుపోయిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. గస్తీని ముమ్మరం చేశారు.