ఫేస్బుక్... ఇక చాలా కాస్ట్లీ గురూ!
ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు మరింత సొమ్ము వెచ్చించాల్సి వస్తుంది. ఎందుకంటే, మొత్తం ప్రకటనల సంఖ్యను తగ్గించి.. ఉన్నవాటికే ధర పెంచాలని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ నిర్ణయించింది. గత సంవత్సరంతో పోలిస్తే 2014 రెండో త్రైమాసికంలో ప్రకటనల ధర 123 శాతం పెరుగుతుందని ఫేస్బుక్ సీఎఫ్ఓ డేవ్ వెహ్నర్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఇంతకుముందు కంటే 25 శాతం తక్కువ ప్రకటనలను ఫేస్బుక్ చూపించినా, ఆదాయం మాత్రం 67 శాతం పెరిగింది.
తమ ప్రకటనల వల్ల వచ్చే ఆదాయాన్ని బట్టే ప్రకటనల ఖరీదు కూడా ఉంటుందని వెహ్నర్ చెప్పారు. మరింత మెరుగైన ప్రకటనలను, మరింత లక్షిత ప్రేక్షకులకు వెళ్లేలా తమ మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకుంటున్నామని ఆయన అన్నారు. దీనివల్ల ఫేస్బుక్ వాడేవాళ్లతో పాటు ప్రకటనకర్తలకు కూడా సులువుగా ఉలుంటుందని చెప్పారు. ఫేస్బుక్ పేజీ డిజైన్ను కొద్దిగా మార్చడంతో ప్రకటనలకు స్థలం తక్కువగా మిగిలింది. అందుకే ధరలు పెంచినట్లు ఫేస్బుక్ తెలిపింది.