
దాతృత్వంలో ‘ఫేస్‌బుక్’ ముందంజ
సియాటెల్: గతేడాది అత్యధిక మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చిన దాతలుగా ‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ నిలిచారు. ఈ దంపతులు 2013 డిసెంబర్‌లో ఒక స్వచ్ఛంద సంస్థకు దాదాపు రూ. 6,000 కోట్ల విలువైన 1.8 కోట్ల ఫేస్‌బుక్ షేర్లను విరాళంగా ఇచ్చారు. ప్రతీ ఏటా అమెరికాలోని దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చే 50 మంది పేర్లను ‘క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీ’ మేగజైన్ ప్రకటిస్తుంటుంది. తాజాగా 2013కు గాను అత్యంత దాతృత్వం గల వ్యక్తుల జాబితాను ప్రకటించింది.
వీరు దాదాపు రూ. 50,000 కోట్లను ఈ ఏడాది వివిధ విద్యాలయాలు, స్వచ్ఛంద, సామాజిక సంస్థలకు విరాళంగా ఇవ్వగా, మరి కొందరు మరో రూ. 25 వేల కోట్ల వరకు విరాళాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ఈ సారి ఎక్కువ శాతం విరాళాలు శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, కళాశాలలకే వచ్చినట్లు మేగజైన్ ఎడిటర్ స్టేసీ పాల్మర్ పేర్కొన్నారు.