‘మహా’ సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం | Fadnavis takes charge of Maharashtra BJP's first chief minister | Sakshi
Sakshi News home page

‘మహా’ సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం

Published Sat, Nov 1 2014 12:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

‘మహా’ సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం - Sakshi

‘మహా’ సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం

మరాఠా గడ్డపై ఏర్పాటైన బీజేపీ తొలి ప్రభుత్వం
హాజరైన మోదీ, అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు
చివరి నిమిషంలో ప్రత్యక్షమైన ఉద్ధవ్ ఠాక్రే
 
 ముంబై: మహారాష్ట్రలో బీజేపీ తొలి ప్రభుత్వం కొలువుతీరింది. అతిరథ మహారథుల సమక్షంలో, అంగరంగ వైభవంగా నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(44) ప్రమాణ స్వీకారం చేశారు. వాంఖడే స్టేడియంలో శుక్రవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఫడ్నవిస్ చేత మహారాష్ట్ర 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, ఎంఎం జోషీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన వసుంధర రాజే(రాజస్థాన్), ఆనందిబెన్ పటేల్(గుజరాత్), మనోహర పారికర్(గోవా), రమణ్ సింగ్(ఛత్తీస్‌గఢ్), ఎంఎల్ ఖట్టర్(హర్యానా).. ఎన్డీయే మిత్రపక్ష సీఎంలు చంద్రబాబు నాయుడు(ఆంధ్రప్రదేశ్), ప్రకాశ్ సింగ్ బాదల్(పంజాబ్) తదితరులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఫడ్నవిస్‌తో పాటు ఏడుగురు కేబినెట్ మంత్రులుగా, ఇద్దరు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి హాజరు కాబోరంటూ వార్తలు వచ్చినా.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, భార్యతో సహా చివరి నిమిషంలో ప్రత్యక్షమై, నూతన సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీతో కరచాలనం చేశారు.
 
 అమిత్ షా వ్యక్తిగతంగా ఆహ్వానించడంతో ఉద్ధవ్ మనసు మార్చుకుని, కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు పక్కన కూర్చున్న ఉద్ధవ్ ఠాక్రే.. అక్కడున్నంతసేపు దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా, మౌనంగా ఉన్నారు. 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 121 మంది సభ్యులున్నారు. మెజారిటీకి అవసరమైన సంఖ్య లేకున్నప్పటికీ.. ఎన్సీపీ బేషరతుగా బయటనుంచి ఇస్తున్న మద్దతు, ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న శివసేన మద్దతుతో.. ఫడ్నవిస్ సునాయాసంగా విశ్వాస పరీక్షలో నెగ్గగలరు. ఫడ్నవిస్‌తో పాటు ఏక్‌నాథ్ ఖడ్సే, సుధీర్ మునగంటివార్, వినోద్ తావ్డే, పంకజ ముండే, ప్రకాశ్ మెహతా, చంద్రకాంత్ పాటిల్, విష్ణు సవరలు కేబినెట్ మంత్రులుగా.. దిలీప్ కాంబ్లే, విద్యా ఠాకూర్‌లు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
 ఆల్ ది బెస్ట్ బాబా.. ప్రమాణం అనంతరం ఆహూతుల నుంచి అభినందనలు అందుకుంటున్న ఫడ్నవిస్‌కు.. అందరి శుభాకాంక్షల కన్నా ఆయన ఐదేళ్ల కూతురు దివిజ చెప్పిన ‘ఆల్ ది బెస్ట్ బాబా’ అనే మాటే అత్యంత సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది. ఫడ్నవిస్ తల్లి సరిత, భార్య అమృతతో పాటు దివిజ సభికుల్లో కూర్చుని ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు.
 
 ఫడ్నవిస్‌కు దక్కడంపై ఆయన సొంత ప్రాంతమైన విదర్భలో హర్షం వ్యక్తమవుతోంది.  
 
 ‘శివసేనతో చర్చలు జరుగుతున్నాయి’: ప్రభుత్వంలో శివసేన చేరాలనే తాను కోరుకుంటున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. ప్రమాణానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు, తాను కూడా ఉద్ధవ్‌ను ఆహ్వానించానన్నారు. ప్రభుత్వంలో చేరే విషయంపై శివసేనతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తొలి మంత్రివర్గ భేటీలోనే సేవాహక్కు చట్టం(రైట్ టు సర్వీస్)పై నిర్ణయం తీసుకుంటామని ఫడ్నవిస్ వెల్లడించారు.
 
 సర్కారులో మంత్రిగా తెలుగు వ్యక్తి
 
 మహారాష్ట్రలో తొలి బీజేపీ ప్రభుత్వంలో ఓ తెలుగు వ్యక్తికి మంత్రిగా స్థానం లభించింది.  బల్లార్షా నుంచి విజయం సాధించిన సుధీర్ మునగంటివార్ కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో ఒక పర్యాయం మంత్రిగా  పనిచేశారు సుధీర్ బీజేపీలో కార్యకర్త నుంచి మహారాష్ట్ర అధ్యక్షుని వరకు ఎన్నో పదవులు నిర్వహించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుధీర్ పూర్వీకులు చాలా కాలం క్రితమే చంద్రాపూర్‌లో స్థిరపడ్డారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement