ట్రంప్ టవర్ లో బాంబు కలకలం
న్యూయార్క్: ట్రంప్ టవర్ లో బాంబు కలకలం రేగింది. గుర్తు తెలియని బ్యాగు పడి ఉండటాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే బిల్డింగును తాత్కాలికంగా ఖాళీ చేయించారు. బాంబు కలకలంతో బాంబు స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. సంచిని తనిఖీ చేసి అందులో ఉన్నవి ఆడుకునే బొమ్మలని తేల్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. మాన్‌హట్టన్‌లోని ట్రంప్ టవర్స్ నుంచి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డేవిస్ మాట్లాడుతూ బాంబ్ స్క్వాడ్ సంచిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. కాగా, అధ్యక్షపదవిని స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఇక్కడే నివసించనున్నారు. ఆయన ప్రస్తుతం ఫ్లోరిడాలో క్రిస్మస్ సెలవుల్లో ఉన్నారు.