
నాపై తప్పుడు ఆరోపణలు
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకున్నానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవి పూర్తిగా రాజకీయ దురుద్దేశ్యంతో కూడినవని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్బలంతో స్థానిక పోలీసులు తప్పుడు కేసు పెట్టారని, సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘‘నవంబర్ 26న హైద్రాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో తిరుపతి విమాశ్రయంలో దిగాను. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విమానంలో హైద్రాబాద్ వెళుతున్నారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి విమానాశ్రయం బయటకు వస్తున్నా.
అదే సమయంలో ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విమానం ఎక్కనివ్వడం లేదని కొందరు ప్రయాణీకులు నాకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తి కోసం ఎదురుచూశాను. ఆయన వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆలస్యానికి కారణాలను ప్రశ్నించాను. సరైన సమాధానం ఇవ్వడానికి బదులుగా ఆయన నాతో కూడా అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు బాధిత ప్రయాణికులతో పాటు పలువురు ప్రత్యక్ష సాక్ష్యులున్నారు. కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు కూడా.
అయితే కొద్దిసేపటి తర్వాత ఆ అధికారి, తన సీనియర్ అధికారులు, స్థానిక పోలీసుల సమక్షంలో నాకు క్షమాపణ చెప్పారు. ఆ సమస్య అంతటితో ముగిసింది. అయితే నేను ఎయిరిండియా మేనేజర్ పై దాడిచేశానని రాత్రి సమయం లో ఫిర్యాదు చేశారు. కానీ అది వాస్తవం కాదు. సంఘటన జరిగిన సమయం నుంచి రాత్రి వరకూ ఏమి జరిగిందో నాకు తెలియదు. నా వాదనను రుజువు చేయడం కోసం సీసీటీవీ కెమెరాల రికార్డులను విడుదల చేయాలని డిమాండ్ చేశాను.
అయితే ఇంత వరకూ వాటిని విడుదల చేయకపోవడాన్ని బట్టి సంఘటన వివరాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని అర్ధమౌతోంది. రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలమే అందుకు కారణం. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌కు ఫిర్యాదు చేశాను. హైద్రాబాద్ హైకోర్టును ఆశ్రయించి, నా ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించాలని కోరతాను.’’ అని మిథున్‌రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రేణుక, వరప్రసాద్ కూడా పాల్గొన్నారు.