బిడ్డల్ని కడతేర్చిన తల్లి
మద్యం రక్కసి మరో కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తన భర్త మద్యానికి చిత్తు అవుతుండడంతో విసిగి వేసారి తన బిడ్డల్ని పావడాకు ఉపయోగించే నాడాతో కడతేర్చి, ఓ తల్లి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. కీల్పాకం వాసుల్నిఈ ఘటన విషాదంలోకి నెట్టింది.
చెన్నై : మద్యం రక్కసి కుటుంబాల్ని మింగేస్తుండడంతో దాన్ని నిషేధించాల్సిందేనన్న డిమాండ్‌తో రాష్ట్రంలో రాజకీయ పక్షాలు ఉద్యమిస్తూ వస్తున్నాయి. అయితే, మద్యం విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. తాగే వాళ్లు టాస్మాక్ మద్యం దుకాణాల్లో నోట్లను తగల బెడుతున్నారు. తాజాగా, ఇదే మద్యం ఆనందకర జీవితాన్ని సాగిస్తున్న ఓ కుటుంబాన్ని చిద్రం చేసింది. తన భర్త మద్యానికి చిత్తు అవుతుండడంతో విసిగి వేసారి, చివరకు బిడ్డల్ని కడతేర్చి తాను ఆత్మహత్యాయత్నం చేయాల్సిన పరిస్థితి ఓ తల్లికి ఏర్పడింది.
మద్యం చిత్తు : చెన్నై కీల్పాకంకు చెందిన సంతోష్ స్టీల్స్ ఎగుమతి దిగుమతులకు సంబంధించి రవాణా కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతనికి భార్య మమత(34), కుమార్తె యాసి(12), కుమారుడు అనుష్(7)ఉన్నారు. యాసి ఏడో తరగతి, అనుష్ రెండో తరగతి చదువుతున్నారు. ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా సాగుతున్న ఈ కుటుంబంలోకి మద్యం రక్కసి ప్రవేశించింది. సంతోష్ ఇటీవల కాలంగా మద్యం తాగడం మొదలెట్టాడు. నిత్యం మద్యం మత్తులో ఉండే భర్తను పలు మార్లు మమత మందలించింది, హెచ్చరించింది.
అయినా, అతడిలో మార్పు రాలేదు. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో వచ్చిన సంతోష్, మమతల మధ్య పెద్ద గొడవే జరిగింది. గురువారం కూడా మరో మారు ఇద్దరి మద్య వివాదం సాగింది. మద్యం మానకుంటే, పిల్లల్ని చంపి, తాను చస్తానంటూ మమత హెచ్చరించినా, దానిని పెద్దగా సంతోష్ పట్టించుకోలేదు. తన భర్త మద్యం చిత్తుతో విసిగి వేసారిన మమత అనుకున్న పని చేసి తీరింది.
బిడ్డల్ని కడతేర్చి : గురువారం సాయంత్రం తీవ్ర మనో వేదనకు గురైన మమత ఉన్మాదిగా మారింది. స్కూల్ నుంచి వచ్చిన యాసిని తొలుత బెడ్ రూంకు తీసుకెళ్లి, తన పావడా నాడాతో గొంతు బిగించి చంపేసింది. మరి కాసేపటికి స్కూల్ నుంచి వచ్చిన అనుష్‌ను అదే నాడాతో గొంతు బిగించి హతమార్చింది. ఇక, తాను ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించింది. మదుమేహ వ్యాధి గ్రస్తులు ఉపయోగించే మాత్రలు పెద్ద సంఖ్యలో మింగేసింది. తీవ్ర అస్వస్థతో స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న మమత, తన పిల్లల్ని చంపేశానని, తాను చచ్చి పోతున్నానంటూ సోదరి కౌశల్యకు ఫోన్ చేసి కట్ చేసింది.
ఆందోళన చెందిన కౌశల్య అక్కడి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో పాటుగా, కీల్పాకంలోని మమత ఇంటికి పరుగులు తీశారు.స్పృహ కోల్పోయి పడి ఉన్న మమతను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పిల్లలు ఇద్దరు మరణించి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చూడటానికి చక్కగా ఉండే ఆ కుటుంబంలో మద్యం రూపంలో మృత్యువు చొరబడడంతో ఆ పరిసర వాసులు తీవ్ర విషాదంలో మునిగారు.
కీల్పాకం పరిసర వాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి రావడం, ఆ పిల్లల్ని చూసి కంట తడి పెట్టిన వాళ్లే ఎక్కువ. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో మమతకు స్పృహ రావడంతో ఎగ్మూర్ రెండో మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జయంతి రంగంలోకి దిగి వాంగ్ములం తీసుకున్నారు. మమతకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయాన్నే పోస్టుమార్టం అనంతరం ఆ ఇద్దరు పిల్లల్ని తండ్రి సంతోష్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసిన కీల్పాకం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.