ఎయిర్ ఇండియా చార్జీలూ పెరిగాయ్
న్యూఢిల్లీ: విమానయాన ఇంధనం ధరలు 15 శాతానికి పైగా పెరగడం, రూపాయి పతనం కారణంగా విమాన యాన సంస్థలు విమానయాన చార్జీలను పెంచుతున్నాయి. చార్జీలను పెంచుతున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా కూడా ప్రకటించింది. ఇటీవలనే జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్‌లు విమాన చార్జీలను 25 నుంచి 30 శాతం వరకూ పెంచాయి.
ప్రయాణికులను ఆకర్షించడానికి ఎయిర్ ఇండియా, కొన్ని విమానయాన సంస్థలు జూన్‌లో విమాన చార్జీలను తగ్గించాయి. సాధారణ చార్జీల కంటే ఈ చార్జీలు 10-15 శాతం తక్కువగా ఉన్నాయి. సిరియా ఆందోళనలు, రూపాయి పతనం నేపథ్యంలో ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో ప్రభుత్వ చమురు మార్కటెంగ్ కంపెనీలు విమానయాన ఇంధనం ధరలను పెంచాయి. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు విమాన చార్జీలను పెంచుతున్నాయి.