తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
నేరేడుచర్ల: తన పొలంలో బోరు వేయనీయడం లేదని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని రాంపురం గ్రామానికి చెందిన హరిబాబు తనకున్న 20 కుంటల పొలంలో వాగును ఆధారం చేసుకొని వరి సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులకు వాగు ఎండిపోవడంతో వరి పొలానికి నీరందడం లేదు. దీంతో హరిబాబు బోరు వేయించేందుకు నిర్ణయించాడు.
ఈ క్రమంలో బోరు బండిని పొలం వద్దకు తీసుకెళ్లాడు. అయితే, సర్పంచ్ చింతమల్ల సైదులు సూచన మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దేవయ్య బోరు వేయవద్దని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో మనస్తాపానికి గురై తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న హరిబాబు.. డిప్యూటీ తహసీల్దార్ కృష్ణను నిలదీశాడు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో తన చేతిలో ఉన్న పురుగుమందు డబ్బా మూత తీసి తాగేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న కొందరు రైతులు అడ్డుకున్నారు. అనంతరం రైతులు డిప్యూటీ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులను శాంతింప చేశారు.
బోరు వేయనీయడం లేదని..
Published Fri, Jan 29 2016 1:56 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement