రాధామోహన్ సింగ్(ఫైల్)
ముంబై: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు మండిపడ్డాయి. అన్నదాతలను ఆత్మహత్యలకు మద్యపానం కారణం కాదని ఎకాల్ మహిళా కిసాన్ సంఘట్న' కన్వీనర్ బేబీతాయ్ వాగ్ స్పష్టం చేశారు. మద్యపానం అనేది సమాజం అంతటికి సమస్య అని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.600 చొప్పున ఇస్తున్న పెన్షన్ ను రూ. 2000 లకు పెంచాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కలిశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలు కారణమని మంత్రి(రాధామోహన్ సింగ్) అంటున్నారు. మరి డబ్బున్న వాళ్ల మాటేమిటి. అన్నదాతలు మద్యానికి బానిసలుగా మారడానికి, అప్పుల పాలవడానికి మహిళలే కారణమా?' అని ఆమె ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు కారణాల్లో అప్పులతోపాటు ప్రేమ వ్యవహారాలు, నపుంసకత్వం తదితరాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపిన సంగతి తెలిసిందే.