బంగారం బిస్కెట్లతో పట్టుబడ్డ తండ్రీకూతురు
ఢిల్లీ/చెన్నై/కోల్కతా: విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 2.2 కోట్ల విలువైన బంగారం అధికారులు పట్టుకున్నారు. దోహ నుంచి వచ్చిన తండ్రి, కూతుళ్ల దీన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్లో విమానం ఎక్కిన వీరు 1.2 కిలోల బంగారపు బిస్కట్లను ఇక్కడికి తీసుకొచ్చారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అధికారులు తనిఖీ చేయడంతో అసలు విషయం బట్టబయలయింది. వీరి లగేజీలో ఉన్న 9 బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించారు. అహ్మదాబాద్కు చెందిన ఈ తండ్రీకూతుళ్లతో పాటు ముంబైకు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు.
కోల్కతాలోని ఎన్ఎస్ఈ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ1.30 కోట్లు విలువ చేసే 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీన్ని అక్రమంగా తరలిస్తున్న దిలీప్ రావు, ప్రకాష్ వాల్మికీ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు బ్యాంకాక్ నుంచి బంగారాన్ని తెచ్చినట్టు గుర్తించారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి 7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారుల స్వాధీనం చేసుకున్నారు.