
అమ్మాయిలు, డబ్బుకు ఆశపడి..!
అతడు అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థకు (ఎఫ్‌బీఐ) చెందిన కీలక ఉద్యోగి. కానీ, చైనా ప్రలోభాలకు లొంగిపోయాడు. అమెరికా చెందిన కీలక సున్నితమైన సమాచారాన్ని ఆ దేశానికి చేరవేశాడు. ఎఫ్‌బీఐ ఉద్యోగిగా పనిచేస్తూ చైనాకు ఏజెంట్‌గా మారిన కున్ షాన్ చున్ తాజాగా కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసినట్టు, వాటికి తానే బాధ్యత వహిస్తున్నట్టు చెప్పాడు.
చైనాతో తనకున్న సంబంధాల విషయంలో తరచూ అబద్ధాలు ఆడుతుండటంతో గత మార్చి నెలలో షాన్ చున్ అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. చైనా ఎరవేసిన డబ్బు, వేశ్యలు, లగ్జరీ హోటల్ గదుల్లో విలాసాలకు లొంగిపోయి.. అమెరికా రక్షణ సమాచారాన్ని ఆ దేశానికి అమ్మివేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు.
చైనాలో పుట్టిన చున్ (46) ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డాడు. జోయ్ చున్‌గా పేరొందిన అతడు 1997లో ఎఫ్‌బీఐలో చేరాడు. ఉద్యోగ విధుల్లో భాగంగా విదేశీ ప్రయాణాలు చేస్తూ.. అతడు చైనీయులతో సంబంధాలు పెట్టుకున్నాడు. చైనా టెక్నాలజీ కంపెనీ కొలియన్‌తో కలిసి ఓ బిజినెస్ వెంచర్‌ని కూడా అతడు ప్రారంభించాడు. ఈ క్రమంలో తన ఉద్యోగ ధర్మానికి సంబంధించిన నియమనిబంధనలన్నింటినీ అతడు ఉల్లంఘించాడని, అంతేకాకుండా రహస్యంగా చైనీయులతో సంబంధాలు కొనసాగించి.. దేశం అతడిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాడని ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు.
తాజాగా నేరాన్ని అంగీకరించిన చున్ తన తప్పులపై విచారం వ్యక్తం చేశాడని, అమెరికాను చున్ ప్రేమిస్తాడని, దేశానికి ఎలాంటి హాని చేయకుండా ఇక ముందు తన జీవితాన్ని కొనసాగించాలని అతను అనుకుంటున్నాడని అతని తరఫు న్యాయవాది ఓ ప్రకటనలో తెలిపారు.