
స్టాక్ మార్కెట్‌కు ఫెడ్ జోష్
♦ వడ్డీరేట్లను పెంచని అమెరికా ఫెడ్
♦ విదేశీ నిధుల తరులుతాయన్న ఆందోళన తగ్గుముఖం
♦ కలసి వచ్చిన రూపాయి బలం
♦ 27,000 దాటిన సెన్సెక్స్... 8000 దాటిన నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలపాలైనా, వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఫెడ్ నిర్ణయం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్‌ను లాభాట బాట పట్టించింది. సాధారణం కన్నా అధికంగానే వర్షాలు కురుస్తుండడం, రూపాయి బలపడడం కూడా కలసి రావడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 27,000 పాయింట్లను, నిఫ్టీ 8,100 పాయింట్లను దాటాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య సంరక్షణ, వాహన, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లు కళకళలాడాయి.
సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 27,116 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 8,175 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్ సూచీలకు ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. లోహ, రియల్టీ సూచీలు మినహా, మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. గత అయిదు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 745 పాయింట్లు లాభపడింది.
మద్దతు ధర ప్రభావం...
వడ్డీరేట్లు దశలవారీగా పెంచాలని యోచిస్తున్నట్లు ఫెడ్ ప్రకటించడంతో భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెళ్లిపోతాయనే ఆందోళనకు తెరపడినట్లేనని నిపుణులంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం కూడా ప్రభావం చూపింది.
రిలయన్స్.. వారంలో 11 శాతం అప్
ఈ ఏడాది చివరికల్లా 4జీ సర్వీసులందిస్తామని వెల్లడించిన నేపథ్యంలో రిలయన్స్ షేర్ వారంలో 11 శాతం పెరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ 2 శాతం, మారుతీ సుజుకీ 1 శాతం, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హిందాల్కో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, షేర్లు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ. 2,999 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,262 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,77,226 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.785 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,110 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
సెన్సెక్స్ టార్గెట్‌లో కోత
33,000 నుంచి 31,000కు తగ్గించిన డాయిష్
ఈ ఏడాది చివరకు సెన్సెక్స్ చేరే టార్గెట్‌ను జర్మనీకి చెందిన బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ 33,000 పాయింట్ల నుంచి 31,000 పాయింట్లకు తగ్గించింది. వచ్చే రెండు క్వార్టర్లలోనూ కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉంటుందని, విదేశీ నిధుల ప్రవాహం మందకొడిగా ఉంటుందని ఈ బ్యాంక్ అంచనా వేస్తోంది.
కాగా ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు సెన్సెక్స్ చేరే అంచనాలను తగ్గించాయి. సిటీ సంస్థ 33,000 నుంచి 32,200కు, హెచ్‌ఎస్‌బీసీ 30,100 నుంచి 26,900కు తగ్గించగా, మోర్గాన్ స్టాన్లీ మాత్రం తన అంచనాల్లో(32,500 పాయింట్లు) ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ఇక యూబీఎస్ సంస్థ నిఫ్టీ టార్గెట్‌ను 9,200 నుంచి 8,600కు తగ్గించింది. కాగా గురువారం సెన్సెక్స్ 27,116పాయింట్ల వద్ద, నిఫ్టీ 8,175 పాయింట్ల వద్ద ముగిశాయి.