మహిళా సీఈవోల జీతాలే ఎక్కువ
న్యూయార్క్: ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే, ఎక్కడైనా సరే మగవాళ్లకన్నా ఆడవాళ్లకే జీతాలు తక్కువ ఇస్తారని ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెబుతారు. అందులో నిజం ఎక్కువే ఉండవచ్చు. కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో మగ సీఈవోలకన్నా మహిళా సీఈవోలకే జీతాలు ఎక్కువ ఇస్తున్నారని ఈక్విలర్ కంపెనీ ఓ అధ్యయనంలో తేల్చింది. కాకపోతే వంద టాప్ కంపెనీలకుగాను 8 మందే మహిళా సీఈవోలు ఉన్నారు. 500 కంపెనీలను పరిగణలోకి తీసుకుంటే 21 మంది సీఈవోలు మాత్రమే మహిళలు ఉన్నారు.
2015 సంవత్సరానికిగాను కంపెనీ సీఈవోలుగా మహిళలు సరాసరి 2.27 కోట్ల డాలర్లను జీతభత్యాలుగా అందుకోగా మగ సీఈవోలు 1.49 కోట్ల డాలర్లను అందుకున్నారని లెక్కలు తెలియజేస్తున్నాయి. మహిళలు ఎన్నోరంగాల్లో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఉన్నత స్థానాల్లో వారికి అవకాశాలు ఎక్కువగా రాకపోవడం ఆందోళనకరమైన విషయమేనని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ సీఈవోల్లో మహిళల శాతం మూడు ఉండగా, అమెరికాలోను, కెనడాలోను అది నాలుగు శాతం, చైనాలో 3.7 శాతం, పాశ్చాత్య యూరప్‌లో 2.3 శాతం, జపాన్‌లో 0.9 శాతం ఉంది.
మగవాళ్లకన్నా, మహిళా సీఈవోలకు అత్యధిక జీతాలు చెల్లించడం హర్షణీయమైన విషయమని, సీఈవోల లాంటి ఉన్నత ఉద్యోగాల విషయాల్లో కంపెనీలేవీ ఉద్దేశపూర్వకంగా వ్యత్యాసాన్ని ఏమీ చూపించడం లేదని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన లీసా లెస్లీ చెప్పారు. ఆడవాళ్లలో నాయకత్వ లోపాలే అందుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యేక శిక్షణల ద్వారా ఈ విషయంలో కూడా మహిళలు పురోభివృద్ధి సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.