![Paytm competitors are hesitating to hire people from fintech firm - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/10/paytm.jpg.webp?itok=rQA_ym5C)
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది.
డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి.
వెనకాడుతున్న స్టార్టప్‌లు
రిక్రూట్‌మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్‌లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కి అనుబంధ సంస్థ.
Comments
Please login to add a commentAdd a comment