కాంగ్రెస్‌లో డిష్యూం.. డిష్యూం
ఉప్పల్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రచ్చరచ్చ
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దు వివాదం కాస్తా పరస్పర దాడులకు దారి తీసింది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఉప్పల్‌లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చ అయ్యింది. జిల్లాలవారీగా విడిపోయిన కార్యకర్తలు నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగడమే కాక.. జెండా కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఆపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసురుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ సహా ఎనిమిది మందికి స్వల్పగాయాలయ్యాయి.
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ బస్టాండ్ సమీపంలో పార్టీ జెండాను సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మరో నేత బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామమల్లేష్ ఆవిష్కరించి మరో కార్యక్రమానికి బయలుదేరారు. ఇంతలో రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఆహ్వానం మేరకు దానం నాగేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అదే జెండా వద్దకు వచ్చి పార్టీ జెండాను దించి మళ్లీ ఆవిష్కరించారు. దీంతో సుధీర్‌రెడ్డి, మల్లేష్, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలోని కార్యకర్తలు.. బుల్లెట్‌పై ర్యాలీగా వెళుతున్న దానం నాగేందర్‌ను అడ్డుకున్నారు.
‘ఏ హోదాలో ఉప్పల్ వచ్చావ్? హైదరాబాద్‌లో పార్టీని నాశనం చేశావ్. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు వచ్చావా? నీ పప్పులు ఇక్కడ ఉడకవు’ అంటూ హెచ్చరించారు. అదే స్థాయిలో దానం, అతని అనుచరులు జ వాబివ్వటంతో రెచ్చిపోయిన బండారి లక్ష్మారెడ్డి వర్గీయులు జెండా కర్రలతో దానం నాగేందర్, ఆయన అనుచరులపై దాడులకు దిగారు. దీంతో దానం అనుచరులు కూడా ప్రతిదాడులకు దిగారు. ఈ దాడుల్లో దానంతో పాటు మురళీకృష్ణ, నిరంజన్, శేఖర్‌రెడ్డి, బాకారం అరుణ్, నవీన్‌కుమార్, పీటర్, శ్రీనివాసరెడ్డి, జితేందర్‌రెడ్డిలకు గాయాలయ్యాయిు. దీనిపై ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నాయకుల మధ్య వివాదం ఏఐసీసీ దృష్టికి వెళ్లింది. పీసీసీ నాయకులు ఘటన వివరాలను ఢిల్లీకి చేరవేశారు.
దానంకు ఇక్కడేం పని: మల్లేష్
తాము ఎగురవేసిన జెండాను తొలగించారన్న సమాచారంతో తాము వచ్చి దానంను ప్రశ్నించామని, ఇంతలో నే తమపై కొందరు దాడికి పాల్పడ్డారని మల్లేష్ ఆరోపించారు. నగరానికి సంబంధించిన దానంకు రంగారెడ్డి జిల్లాలో ఏం పనని ప్రశ్నించారు. కాగా, ‘గ్రేటర్’ నాయకులు రంగారెడ్డి జిల్లాలో ఆధిపత్యం చెలాయిం చాలని చూస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యేలు బండారి రాజిరెడ్డి, సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవా రం వారు కుషాయిగూడలో కాంగ్రెస్ ఉప్పల్ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.
తోపులాటే.. సర్దిచెబుతాం: దానం
సమాచార లోపంతోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగిందని, పార్టీ పెద్దలతో మాట్లాడి అన్నీ సరిచేస్తామని దానం నాగేందర్ చెప్పారు. తనపై ఎవరూ దాడి చేయలేదని చెప్పారు. ఘటన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎగరేసిన జెండాను, తాను మళ్లీ ఎగరేయడంతో వివాదం రేగిందని, ఇది సమాచార లోపంతో జరిగిన తప్పిదమన్నారు.