ఎట్టకేలకు రోడ్డెక్కిన చెన్నై | Finally chennai on road | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు రోడ్డెక్కిన చెన్నై

Published Sun, Dec 6 2015 5:11 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

నగరంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరిన జనం - Sakshi

నగరంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరిన జనం

- ఐదు రోజుల తర్వాత వర్షాల నుంచి కాస్త ఉపశమనం
- వరద కూడా తగ్గుతుండడంతో కుదుటపడుతున్న నగరం
- భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడి
- ఇప్పటికీ చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు
- పెట్రోలు బంకులు, ఏటీఎం, పాలబూత్‌ల వద్ద జనం బారులు
- బస్సులు, రైలు సేవలు పాక్షికంగా పునరుద్ధరణ

చెన్నై నుంచి నందగోపాల్, సాక్షి ప్రతినిధి : ఐదు రోజుల నుంచీ వరుణుడి ప్రకోపంతో విలవిల్లాడిపోతున్న చెన్నై నగర ప్రజలకు ఎట్టకేలకు శనివారం కాస్త ఊరట లభించింది. శుక్రవారంనాటికి కొన్ని ప్రాంతాల్లోనే ముంపు తగ్గగా, శనివారం మరికొన్ని ప్రాంతాలు వరద నీటి నుంచి ఉపశమనం పొందాయి. దీంతో ధైర్యం తెచ్చుకొని ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చారు. అయితే వలంటీర్లు, సహాయ బృందాలు అందిస్తున్న ఆహార పదార్థాలు, బిస్కెట్ ప్యాకెట్లతో కడుపు నిండే పరిస్థితి లేకపోగా, రోడ్డుపై విక్రయిస్తున్న పాలప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు చూసి విస్తుపోవడం వారి వంతైంది. ఎంతో కొంత డబ్బు మిగిలినవారు అధిక ధరలు చెల్లించి కొనడానికి క్యూ కడుతుండగా, నిరుపేదలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

మరికొందరు పూర్తిగా నిండని కడుపుతోనే తమ ఇళ్ల నుంచి వ్యర్థాలు తొలగించడంపై దృష్టిపెట్టారు. ఐదు రోజులుగా నీళ్లల్లో నాని పాడైపోయిన సర్టిఫికెట్లు, ఫర్నీచర్లు, ఉప్పు, పప్పులు ఆరబెట్టుకోవడం కోసం స్థానికులు నానా పాట్లూ పడుతున్నారు. డ్రైనేజీ వ్యర్థాలతో నిండిపోయిన వంట సామాన్లను ముక్కుమూసుకొని శుభ్రం చేసుకుంటున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వరద తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం రైళ్లు, బస్సుల సేవలు పాక్షికంగా పునరుద్ధరించింది. అక్కడక్కడా పెట్రోలు బంకులు, ఏటీఎంలు స్వల్ప సంఖ్యలో పనిచేయడం ప్రారంభించాయి. దీంతో వందలకొద్దీ వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూలు కట్టారు. కొన్ని చోట్ల మొబైల్ ఏటీఎంలు నడుపుతున్నారు. కేరళ రాష్ట్రం జైళ్ల శాఖ అక్కడి ఖైదీల ద్వారా 5వేల చపాతీలను, జామ్‌ను తయారుచేయించి విమానం ద్వారా తమిళనాడుకు చేరవేసింది. సెల్‌ఫోన్ సర్వీసులు కూడా కొంతమేర అందుబాటులోకి వచ్చాయి.

 మళ్లీ మొదలైన టెన్షన్: గత నెలరోజులుగా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజానీకాన్ని శనివారం వాతావరణ శాఖ సూచన మరోసారి టెన్షన్ పెట్టింది. బంగాఖాతంలో శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటూ భారీ వర్షాలు కొనసాగుతాయని చెన్నై వాతావరణశాఖ డైరక్టర్ రమణన్ ప్రకటించారు. ఈ అల్పపీడనం వల్ల తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు చెన్నై పూర్తిగా మునిగిపోగా, వరదనీరు ప్రవహించేలోపునే మళ్లీ వర్షాలు పడతాయని చేసిన ప్రకటన అబద్ధమైతే బాగుంటుందని వాపోతున్నారు.

 చెంబరబాక్కం తెగబోతోందా?: గత 20 రోజులపాటూ కురిసిన వర్షాలకు తోడు చెంబరబాక్కం చెరువు నుండి ప్రవహించిన వరదనీటితో జనవాసాలన్నీ నీట మునిగిపోగా, చెంబరబాక్కం చెరువు తెగబోతోందనే వదంతులు బయలుదేరాయి. నడుము లోతు నీళ్ల నుండి బైటపడకముందే పీకల్లోతు నీళ్లలోకి వెళ్లిపోతున్నామని ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ సమాచారం ప్రభుత్వం చెవినకూడా పడటంతో వదంతులు నమ్మవద్దని, చెంబరబాక్కం చెరువు పటిష్టంగా ఉందంటూ హడావిడి ప్రకటన చేయాల్సి వచ్చింది.

 ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు: నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు నావికాదళానికి చెందిన మూడు నౌకలు సుమారు 700 టన్నుల ఆహారపదార్థాలతో, పది బోట్లతో చెన్నై హార్బర్‌కు చేరుకున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శనివారం కూడా ఏరియల్ సర్వే చేసి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు సైన్యం 5500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతవరకు తాము 16,325 మంది పౌరులను, 30 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ పేర్కింది. 19,465 ఆహార పొట్లాలు, 16,002 తాగునీటి ప్యాకెట్లు సరఫరా చేసినట్లు వెల్లడించింది. వరద నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల వద్దకే కాయగూరల్ని తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అదనంగా రెండు వందల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

 ఆ మార్గంలో ఉచిత బస్సు ప్రయాణం..
 రవాణా సౌకర్యాలు శుక్రవారంతో పోలిస్తే కాస్త మెరుగయ్యాయి. చెన్నై కోయంబేడు నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల సేవల్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల వైపుగా సాగే నగర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఈ నెల 8 వరకు ఉచితంగా సేవల్ని అందిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులను ఆదివారం నుంచి పగటి పూట పునరుద్ధరిస్తామని, రాత్రి వేళ నడిపే అంశంపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరోవైపు మూడు రోజులుగా ఆగి ఉన్న ఈఎంయూ(ఎలక్ట్రిక్) రైళ్ల సేవలు పునరుద్ధరించారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పర్వం ముగియడంతో సెంట్రల్, ఎగ్మూర్‌ల నుంచి రైలు సేవలకు అధికారులు నిర్ణయించారు. సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత రైలు సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
 
 రీలే కాదు.. రియల్ హీరోలు కూడా..

 సాక్షి, చెన్నై: వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలను ప్రకటించిన తమిళ నటీనటులు శనివారం స్వయంగా సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమిళ నటులు విశాల్, ధనుష్, కార్తీ, సిద్ధార్థ్, కోవై సరళ, ఖుష్బూ తదితరులు వివిధ ప్రాంతాల్లో సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులకు తమ తరఫున ఆహార పొట్లాలను, మంచి నీటి పాకెట్లను అందించారు. హీరో విశాల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది బాధితులకు ఆహారాన్ని అందించారు. బాధితులతో మమేకం అయ్యి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాడు. కార్తీ కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యాడు.

నటీమణులు ఖుష్బూ, కోవై సరళలు తమ వంతుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హీరో సిద్ధార్థ్ ఒక టీమ్‌నే తయారు చేసుకుని వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ట్వీటర్ ద్వారా వలంటీర్లతో అనుసంధానమై పనిచేస్తున్నాడు. వీలైన వారు ఆహార పొట్లాలను, నీళ్ల బాటిళ్లను తెచ్చి బిగ్ ఎఫ్‌ఎమ్ ఆఫీసులో అందజేయాలని, అక్కడి వరకూ రాలేని వాళ్లు ట్వీటర్ ద్వారా సమాచారం అందిస్తే తమ వాళ్లే వాహనాల్లో వచ్చి వాటిని సేకరిస్తారని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.

 ‘మా’ 5 లక్షల  విరాళం: ‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు చెన్నై తల్లి లాంటిది. అలాంటి చెన్నై నగర ప్రజల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికే మా బిడ్డల్లాంటి హీరోలు స్పందించి తమకు తోచిన సాయాన్ని ప్రక టించారు. అందుకే ‘మా’ అసోసి యేషన్ తరపున కూడా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాం’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
 
 ఏపీలో తేలికపాటి జల్లులు

 సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక వైపు మళ్లింది. ప్రస్తుతం ఇది దక్షిణ తమిళనాడుకు ఆవల కొమరిన్ ప్రాంతానికి ఆనుకుని శ్రీలంకపై కొనసాగుతోంది. దీని ప్రభావం దక్షిణకోస్తా, రాయలసీమపై బాగా తగ్గింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు కూడా బలహీనపడ్డాయి. ఫలితంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆ ప్రాంతాల్లో వర్షాలు బాగా తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దీంతో గత 24 గంటల్లో అటు రాయలసీమ, ఇటు దక్షిణకోస్తాలో ఎక్కడా వర్షాలు కురవలేదు. వచ్చే రెండు రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
 
 రూ.2 లక్షల చొప్పున పరిహారం: మోదీ
 తమిళనాడు వరద మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వరదతో తీవ్రంగా దెబ్బతిన్న చెన్నై ప్రజలకు తోడుగా నిలిచేందుకుగాను 27 ట్రక్కుల్లో తినుబండారాలు, నాలుగు లక్షల బాటిళ్ల తాగునీరు పంపినట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. నగరంలో 90 శాతం మేర విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా చెన్నైకు 75 వేల డాలర్లను వరద సహాయంగా ఇవ్వనున్నట్లు సింగపూర్, రూ.2 కోట్లను కరూర్ వైశ్యా బ్యాంకు ప్రకటించాయి. తమ సిరీస్ పూర్తికాగానే చెన్నై బాధితులకు చేయూతనందిస్తామని టీమిండియా ప్రకటించింది.
 
 తెలుగు కూలీల పరిస్థితి దయనీయం
 పొట్టకూటి కోసం బేల్దారీ కూలీలుగా చెన్నైకి వచ్చిన ఏపీ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి సుమారు 20 కుటుంబాలు భార్యా, పిల్లలతో రెండునెలల క్రితం చెన్నైకి వచ్చాయి. వీరంతా ఇక్కడి సాలగ్రామంలోని ఒక భారీ నిర్మాణంలో పనిచేస్తున్నారు. భారీ వర్షాల వల్ల యజమాని పనులను నిలిపివేశారు. పనిచేస్తేగానీ కూలి దక్కని పేద జనం ఆకలితో అల్లాడుతున్నారు. విశాఖకు చెందిన ఆదినారాయణ, రమణ సాక్షి తో మాట్లాడుతూ, తాగేందుకు నీళ్లు లేవు, ఆకలి తీర్చుకునేందుకు డబ్బులు లేవు, ఎవరినైనా అడుక్కుందామంటే తమిళభాష తెలియదని వాపోయారు. వర్షాలు ఎపుడు తగ్గుతాయో, పనులు ఎపుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. 8 నెలల చిన్నారి, గర్భిణి, పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన రోజుల్లోని కూలీ డబ్బులు కూడా అయిపోయాయని వాపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement