- సహాయక చర్యలకు అంతరాయం
- పాక్షికంగా నడుస్తున్న రైళ్లు, బస్సులు
చెన్నై
ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలమైన చెన్నై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఆదివారం ఉదయం మరో సారి వర్షం మొదలు కావడంతో.. సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. శనివారం పెద్దగా వర్షం లేక పోవడంతో పలు ప్రాంతాల్లో వరద నీరు తగ్గు ముఖం పట్టింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చారు. కాగా.. బంగాళాఖాతంలో శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 24 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు.
మరోవైపు వరద తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం రైళ్లు, బస్సుల సేవలు పాక్షికంగా పునరుద్ధరించింది. చెన్నై సెంట్రల్,ఎగ్మూర్ నుంచి పాక్షికంగా రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విజయవాడ - చెన్నై మధ్య ఆదివారం నుంచి రైళ్ల రాక పోకలు ఎప్పటి లాగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై కోయంబేడు నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సేవల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. నగర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఈనెల 8వరకూ ఉచితంగా సేవలు అందిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
భారీ వర్షాలు.. వరదల కారణంగా పూర్తిగా నీటమునిగిన చెన్నై విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. వాతావరణం సహకరిస్తే... పగటి పూట విమాన సర్వీసులను నడిపిస్తామని పౌరవిమాన యాన సంస్థ ప్రకటించింది. రాత్రిపూట విమానాలను నడిపే అంశంపై త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. ప్రస్తుతం దేశీయ విమానాలను మాత్రమే నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయం పూర్తిస్థాయిలో పునరుద్దరించిన తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిర్ పోర్టులోకి అనుమతిస్తామని తెలియజేశారు.
కాగా.. శనివారం వర్షాల నుంచి తెరిపి లభించడంతో.. పలు ప్రాంతాల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే.. ఇంకా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నాయి. ఆర్మీ, నావికాదళానికి చెందిన బృందాలు నిరంతరాయంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. లోతట్టు ముంపు ప్రాంతాలకు సైతం వెళ్లి బాధితులకు ఆహార పొట్లాలు అందిస్తున్నాయి. కాగా.. ఆదివారం ఉదయం కురిసిన వర్షం కారణంగా.. పాక్షికంగా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది.
వరద నుంచి కోలుకున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరించే పనుల్లో అధికారులు తలమునకలుగా ఉన్నారు. యుద్ద ప్రాతిపదికన కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ సేవలు పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి.