సాక్షి, చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 29 నాటికి దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ముమ్మరంగా సహాయక చర్యలు
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తూత్తుకూడి, చెంగల్పట్టు, నాగపట్టణంలోని అనేక ప్రాంతాలు నీటి ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో వందకు పైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ముంపు తీవ్రత అధికంగా ఉన్న కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. పలు కాలనీల్లో చేరుకున్న వరద నీటిని నీటి ఇంజన్లతో తోడుతున్నారు. కాగా చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తమిళనాడులో నవంబరు మాసంలో వంద సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని స్టాలిన్ తెలిపారు. గత రెండువందల సంవత్సరాలలో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇది నాలుగోసారి అని మీడియకు తెలిపారు.
మరో అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబరు 2వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment