
వర్షం కారణంగా రోడ్డుపై ఆగిన వాహనాలు
సాక్షి, చెన్నై: చెన్నైపై మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. అనేక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లలో వర్షపు నీరు పోటెత్తడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అక్టోబరు, నవంబర్‌లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చెన్నై నగరం , శివారులు రెండు సార్లు నీట మునగక తప్పలేదు. ఇప్పుడిప్పుడే లోతట్టు ప్రాంతాల్లోనివారు కోలుకుంటున్న నేపథ్యంలో గురువారం హఠాత్తుగా కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షం పడింది. మధ్యాహ్నం ఒంటి గంట అనంతరం హఠాత్తుగా వరుణుడు పలకరించాడు.
తొలుత చిరు జల్లులు పడ్డా క్రమంగా భారీగానే వర్షం పడింది. నగరంలోని గింది, సైదా పేట, వడపళని, నుంగంబాక్కం, ఎంఆర్‌సీ నగర్, కేకేనగర్, అరుంబాక్కం తదితర మార్గాలు, ఉత్తర చెన్నై పరిధిలో అనేక మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. కొత్వాల్ చావడి పరిసరాల్లో మోకాలి లోతుకు నీరు చేరడంతో వ్యాపారులకు ఇక్కట్లు తప్పలేదు. అత్యధికంగా ఎంఆర్‌సీ నగర్‌లో 18 సె.మీ, నుంగంబాక్కంలో 15 సె.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం చెన్నైకు సమీపంలో కేంద్రీకతమై ఉందని, ఈ ప్రభావంతోనే వర్షాలు పడుతున్నట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ భువియరసన్ తెలిపారు.
చెన్నైలో వరదలకు శాశ్వత పరిష్కారం లభించేనా..?
వర్షాల సీజన్‌లో చెన్నై నీట మునగడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. గతం పునరావతం కాకుండా, వరదల కట్టడికి శాశ్వత పరిష్కారంపై దష్టి పెట్టారు. ఇందుకోసం చేపట్టాల్సిన పనులు, ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో చేపట్టిన పనులు, తదితర అంశాల్ని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తిరుపుగల్ నేతత్వంలోని నిపుణుల బందం పరిశీలించింది. శాశ్వత పరిష్కారం కోసం తమ సిఫారసులతో నివేదికను సిద్ధం చేసింది. శుక్రవారం ఈ నివేదికను సీఎం స్టాలిన్‌కు సమర్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment