భారత్ లో ఆపిల్ కు మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : భారత్ లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్న టెక్ దిగ్గజం ఆపిల్ కు అడగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. భారత్ లో తయారీ సంస్థ ఏర్పాటుచేసేందుకు కంపెనీ అడుగుతున్న పన్ను మినహాయింపులను ఇవ్వలేమని, వారి అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. కంపెనీకి అలాంటి మినహాయింపులేమీ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పేసింది. మేకిన్ ఇండియాలో భాగంగా దీర్ఘకాలిక సుంకం మినహాయింపులతో పాటు పన్ను పరిమితుల నుంచి తమను తప్పించాలని కంపెనీ కోరుతోంది. అయితే ఈ డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరిస్తూ వస్తోంది. ఆపిల్ పన్ను డిమాండ్లతో పాటు కంపెనీ ప్రైమరీ అసెంబ్లర్ తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ కూడా మొబైల్ ఫోన్లను ఎగుమతి చేయడానికి మద్దతు కోరుతోంది.
అదేవిధంగా త్వరలో అమలుకాబోతున్న ఏకీకృత పన్ను విధానం జీఎస్టీ నుంచి కూడా తమకు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ఆపిల్, ఫాక్స్ కాన్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. దిగుమతి చేసుకునే పరికరాలపై డ్యూటీలను, 15 ఏళ్ల పన్ను హాలిడేను కల్పించాలని కోరుతున్నాయి. అయితే ఈ డిమాండ్లను జీఎస్టీ పరిధిలోకి వస్తాయని తెలిపిన ఆర్థికమంత్రిత్వ శాఖ, వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్లను తయారుచేయడానికి బెంగళూరులో ప్లాంట్ ను నెలకొల్పబోతున్నట్టు కంపెనీ తెలిపిన సంగతి తెలిసిందే.