
మాయావతి బాంబులు వచ్చాయి..!
లక్నో: వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో వేడెక్కిన రాజకీయ వాతావరణాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. దీపావళి పండగ సందర్భంగా బాణసంచా అమ్ముకునేందుకు రాజకీయ నేతల పేర్లను వాడుకుంటున్నారు. టపాకాయలకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి పేర్లు పెట్టారు. మాయావతి బాంబులు, సమాజ్వాదీ పార్టీ రాకెట్స్ పేరుతో టపాకాయలను అమ్ముతున్నారు.
రాకెట్స్ ఉన్న ప్యాకెట్లపై సమాజ్వాదీ రాకెట్స్ అని రాసి, వాటిపై ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఫొటోను ముద్రించారు. ములాయం తన స్నేహితుడు అమర్ సింగ్కు స్వీట్లు తినిపిస్తున్నట్టుగా ప్యాకెట్లపై ఉంది. మరికొన్ని ప్యాకెట్లపై మాయవతి ఫొటోను ముద్రించి, పక్కన యాంగ్రీ బాంబ్స్ అని రాసి వుంది. థౌజండ్ వాలా టపాకాయలకు అఖిలేష్ కీ లారీ అన్లిమిటెడ్ అని పేరు పెట్టి ఆయన ఫొటో వేశారు.
ఇటీవల ములాయం కుటుంబంలో కలహాలు రావడం, సమాజ్వాదీ పార్టీలో తీవ్ర విబేధాలు ఏర్పడం, కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు హోరాహోరీగా పోరాడుతుండటంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు టపాకాయలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.