వాషింగ్టన్: ‘మెదడు ఉందా? లేదా’ అని మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారా? అయితే చేపలను బాగా లాగించేయండి. చేపలను బాగా తింటే మెదడు పెద్దదవుతుందని, అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిజేరవని తేలింది. చేపనూనెలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల స్థాయి ఎక్కువగా ఉండే వారిలో వృద్ధాప్యంలో మస్తిష్కం ఆరోగ్యంగానే కాకుండా పరిమాణంలోనూ పెద్దగా ఉంటుందని సౌత్ డకోటా వర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 1,111 మంది మహిళల ఎర్ర రక్తకణాల్లోని ఒమేగా-3 స్థాయిలను పరీక్షించారు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత అంటే.. వారికి 78 ఏళ్లు వచ్చాక మెదడు పరిమాణాన్ని కొలిచారు.
ఒమేగా-3 స్థాయిలు ఎక్కువగా ఉన్న వారి మెదడు మిగతావారికంటే 0.7 శాతం పెద్దగా, జ్ఞాపకశక్తిలో కీలకమైన ‘హిపోకేంపస్’ భాగం 2.7 రెట్లు పెద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీని వల్ల మెదడు కణాల నాశనం, వృద్ధాప్యం ఆలస్యమవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన జేమ్స్ పొటాలా చెప్పారు.